రేవంత్, ఉత్తమ్‌లను బద్నాం చేసేందుకు హరీశ్ యత్నం
ABN , Publish Date - Jul 09 , 2026 | 06:12 AM
కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధాలు చెబుతూ.. సీఎం రేవంత్‌రెడ్డిని, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని బద్నాం చేసేందుకు బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారని..
నాణ్యత లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టించిందే నువ్వు
కేసీఆర్ పదవి నుంచి తప్పించిందే అందుకు
కాంగ్రెస్ పై నింద వేసేముందు జవాబు చెప్పు
3 నెలల పాటు ఇరిగేషన్ శాఖ కావాలా?
రాజ్యాంగమంటే చిన్నపిల్లల ఆట లెక్కనా?
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకో.. సీఎం రేవంత్, ఉత్తమ్ ఆలోచిస్తరు
చర్చకు సిద్ధమని సీఎం అంటున్నారుగా..!
నీ మామ కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా
నువ్వా..రేవంత్ గురించి మాట్లాడేది!
నాణ్యత లేకుండా ప్రాజెక్టు కట్టి.. అది కూలడానికి కారణమైన నిన్నేం చేయాలి?
అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డల్లో నీళ్లు నిల్వచేయొద్దని ఎన్డీఎ్‌సఏనే చెప్పింది
హరీశ్‌పై తూర్పు జగ్గారెడ్డి మండిపాటు
నిలదీయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు
హైదరాబాద్, జూలై 8(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధాలు చెబుతూ.. సీఎం రేవంత్‌రెడ్డిని, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని బద్నాం చేసేందుకు బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి విమర్శించారు. అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయరాదన్న నిర్ణయం సీఎం, మంత్రి ఉత్తమ్‌లది కాదని తెలిపారు. ఆ నిర్ణయం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అఽథారిటీ (ఎన్డీఎస్ఏ) అని గుర్తుచేశారు. ఆ బ్యారేజీల్లో నీటిని నిల్వ చేస్తే అవి కూలిపోయి కింద ఉన్న ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని అనేక గ్రామాలు కొట్టుకుపోతాయని ఎన్డీఎస్ఏ హెచ్చరించిందని తెలిపారు. అవి కొట్టుకుపోయినా హరీశ్‌రావుకు ఫరవాలేదా? అని నిలదీశారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసలు కాళేశ్వరం ప్రాజెక్టును నాణ్యత లేకుండా కట్టించిందే హరీశ్‌రావు అని ఆరోపించారు.
అందుకే ఆయన ను మంత్రి పదవి నుంచి కేసీఆర్ తప్పించారని తెలిపారు. నిందలు కాంగ్రెస్‌పై వేసే ముందుకు దీనికి హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం నుంచి నీళ్లు ఇవ్వటంలేదని నిందలేసి.. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌లను ఉరితీయాలని హరీశ్‌రావు మాట్లాడుతున్నారని, ప్రాజెక్టును నాణ్యత లేకుండా కట్టించి, అది కూలడానికి కారణమైన హరీశ్‌రావును ఏం చేయాలని ప్రశ్నించారు. ‘తనకు మూడు నెలల పాటు ఇరిగేషన్ శాఖ ఇవ్వాలని హరీశ్‌రావు మాట్లాడుతున్నారు. ఆయన అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారా? లేదంటే కొత్త రాజ్యాంగం ఏదైనా రాస్తున్నారా? రాజ్యాంగం అంటే హరీశ్‌రావుకు చిన్నపిల్లల ఆటలెక్క ఉందా? ఆయనకు మంత్రి అవ్వాలని అంతగా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. ఆ తర్వాత సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌లు ఆలోచన చేస్తరు’ అని చురకలంటించారు. కాళేశ్వరం నీటిని చంద్రబాబుకు సీఎం రేవంత్ గురుదక్షిణగా ఇచ్చారని హరీశ్‌రావు మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చింది.. కేటీఆర్‌కు ఎవరి పేరు పెట్టింది ఆయన మరిచాడా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాళేశ్వరంపై చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ అంటున్నారని, కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురావాలని హరీశ్‌రావుకు సూచించారు. ‘సీఎం రేవంత్ పర్సనాలిటీ కంటే హరీశ్ పర్సనాలిటీ పెద్దదా? నేను 1995లో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు హరీశ్ కాలేజీ విద్యార్థి. మామ కేసీఆర్‌ను చూపించి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయిన వ్యక్తి హరీశ్. జెడ్పీటీసీ సభ్యుడి స్థాయి నుంచి సీఎంగా రేవంత్‌రెడ్డి కష్టపడి ఎదిగారు. హరీశ్‌రావు.. మీకు మీరు ఎక్కువగా ఊహించుకోవద్దు’ అని చురకలంటించచారు. కాళేశ్వరం విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్న హరీశ్‌రావును ఎక్కడికక్కడ నిలదీయాలని కాంగ్రెస్ శ్రేణులకు జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.