కేంద్రమంత్రిగా నీకు పాలనపై అవగాహన లేదు
ABN , Publish Date - Jul 14 , 2026 | 06:12 AM
కేంద్ర మంత్రిగా బండి సంజయ్‌కి తన అధికారాలు, పాలనపై కనీస అవగాహన లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.
చేతనైతే డ్యాం సేఫ్టీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించు
ప్రతిపక్ష నాయకుడిలా డైలాగులు వద్దు
కేంద్రమంత్రిగా తెలంగాణకు ఏం చేశావు?
కాళేశ్వరంపై సీఎం, ప్రతిపక్షాలతో కేంద్రం మీటింగ్ పెడితే నిజానిజాలు తెలుస్తాయి
ఈ నెల 20లోపు అధిష్ఠానానికి తుంగతుర్తి నివేదిక అందజేస్తా
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి, జూలై13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేంద్ర మంత్రిగా బండి సంజయ్‌కి తన అధికారాలు, పాలనపై కనీస అవగాహన లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ)తో సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. బండి సంజయ్ చేతనైతే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ చెప్పినట్లుగా నేషనల్ డ్యాంసేఫ్టీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించాలని సవాల్ విసిరారు. దీనికి ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించాలని, అప్పుడే కాళేశ్వరంపై నిజానిజాలు వెలుగు చూస్తాయన్నారు. కేంద్ర మంత్రి అనే ధ్యాస లేకుండా ప్రతిపక్ష నేతలాగా మీడియా ముందు డైలాగులు కొట్టడం మానుకోవాలని సూచించారు. ఇలాంటి వ్యక్తిని ప్రధాని మోదీ కేంద్రమంత్రిని చేయడం తెలంగాణ దురదృష్టమన్నారు. బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుకు పట్టిన రోగమే సంజయ్‌కి పట్టిందని మండిపడ్డారు.
20లోపు తుంగతుర్తిపై నివేదిక..
తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేధాలను పరిష్కరించే బాధ్యతను అధిష్ఠానం తనకు అప్పగించిందని జగ్గారెడ్డి తెలిపారు. అక్కడి ఎమ్మెల్యే సామేల్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు అన్ని మండలాల ముఖ్యనేతలు, కార్యకర్తలతో మాట్లాడినట్లు చెప్పారు. చివరగా ఇన్‌చార్జి మంత్రి లక్ష్మణ్‌కుమార్, ఇతర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ల అభిప్రాయాలు సైతం తీసుకొని ఈ నెల 20వ తేదీలోపు నివేదికను సీఎంకు, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌కు అందజేస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ తుంగతుర్తిలో కాంగ్రెస్ గెలిచేలా సమన్వయం చేస్తామన్నారు.