ఓట్ చోరీకి పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:37 AM
ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డిలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి
రాహుల్ గాంధీకి మద్దతుగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి ’సేవ్ అవర్ ఓట్స్‘ కార్యక్రమం..
ఓటర్ల పేర్లు, బూత్ నంబర్లు సందేశాలతో బ్యాలెట్ బాక్స్‌లో వినతులు
ఓటు హక్కు పరిరక్షణ పోరాటానికి సంఘీభావం
రాహుల్‌గాంధీకి మద్దతుగా సంగారెడ్డి నుంచి రాష్ట్రపతికి ఓట్ కార్డులు పంపిస్తున్నా: జగ్గారెడ్డి
సంగారెడ్డిటౌన్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డిలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ’సేవ్ అవర్ ఓట్స్‘ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన బ్యాలెట్ బాక్స్ ద్వారా ప్రజలు తమ సంఘీభావాన్ని తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా 73 లక్షల ఓట్లను తొలగించారని, 92లక్షల మంది ఓటర్లకు నోటీసులిచ్చారని ఆరోపించారు. ఓట్ల చోరీ కారణంగానే బీజేపీ ఎంపీలు గెలుస్తున్నారని, వారి మద్దతుతో మోదీ ప్రధాని అవుతున్నారని విమర్శించారు. బీజేపీకి అనుకూలంగా లేని రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ ఎంపీలు గెలవడమే అందుకు నిదర్శనమని అన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపబోనని రాహుల్ గాంధీ ప్రకటించారని గుర్తుచేశారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్ రాష్ట్రపతిని కలిశారని, ఆయన పోరాటానికి సంఘీభావంగా సంగారెడ్డిలో నిరసన కొనసాగిస్తామన్నారు.