Jagga Reddy Criticizes: రేవంత్, ఉత్తమ్‌ల ఇరిగేషన్ ప్రజెంటేషన్ కరెక్ట్!
ABN , Publish Date - Jan 05 , 2026 | 03:35 AM
అసెంబ్లీలో ఇరిగేషన్‌పైన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఇచ్చిన ప్రజెంటేషన్ కరెక్టని, తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒట్టి బోగస్ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు .....
హరీశ్‌రావు ప్రజెంటేషన్ బోగస్
కేసీఆర్ తోలు తీస్తానంటే.. రేవంత్ నాలుక కోస్తానన్నడు.. తప్పేముంది?
నాడు కేసీఆర్‌కు ఆంధ్రా నీటి దోపిడీ గుర్తుకు రాలేదా?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పంచాయితీ తెరపైకి వస్తుంది
చంద్రబాబు, జగన్‌లను సీఎం హోదాలో కేసీఆర్ కలిస్తే తప్పులేదా?.. రేవంత్, బాబు కలిస్తేనే తప్పా?
కాంగ్రెస్ హయాంలోనే మంజీరా, సింగూరు
ఆ ప్రాజెక్టుల నీళ్లు తాగే కేసీఆర్, హరీశ్‌లు పెరిగారు
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి
హైదరాబాద్, జనవరి 4(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో ఇరిగేషన్‌పైన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఇచ్చిన ప్రజెంటేషన్ కరెక్టని, తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒట్టి బోగస్ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. హరీశ్ చెప్పినవన్నీ దొంగ లెక్కలు, దొంగ మాటలేనన్నారు. కేసీఆర్ తోలు తీస్తానంటూ మాట్లాడితేనే సీఎం రేవంత్‌రెడ్డి నాలుక కోస్తానని అన్నారని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ వాళ్లకు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రావాళ్ల నీళ్ల దోపిడీ గుర్తుకు రాదు.. కానీ ప్రతిపక్షంలోకి రాగానే నీటి దోపిడీ గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. బాబు హయాంలో మంత్రిగా, తెలంగాణకు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రావాళ్లతో కేసీఆర్‌కు ఎలాంటి పంచాయితీ లేదని, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఆంధ్రావాళ్లతో పంచాయితీ తెరపైకి వస్తుందన్నారు. ఇందులో మతలబు ఏంటని నిలదీశారు. గాంధీభవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తాను సాగునీటిశాఖ మంత్రి అయ్యాకనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నట్లుగా ప్రజెంటేషన్‌లో హరీ్‌షరావు చెప్పారని, ఆ విషయాలను అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదన్నారు. ‘‘కాళేశ్వరం కట్టాకే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నారా? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమీ చేయలేదా? మంజీరా, సింగూరు ప్రాజెక్టులను ఎవరు కట్టారు? అవి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినవి కావా? మంజీరా, సింగూరు నీళ్లు తాగే కేసీఆర్, హరీశ్ రావులు పెరిగారు. ఆ చరిత్రను వారు మరిచి పోవద్దు!’’ అంటూ హితవు పలికారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల పనులు 90ు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తి చేశాయని, మిగిలిన 10ు పనులు పూర్తి చేయాలంటూ కేసీఆర్‌ను అడిగినా పదేళ్ల పాలనలో పట్టించుకోలేదన్నారు. రూ.7,600 కోట్లు ఖర్చు పెడితే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యేవని, పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందేదని పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల గురించి అడిగినందుకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లను సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం హరీశ్‌కు గుర్తు లేదా అని నిలదీశారు.ఏపీకి చంద్రబాబు, జగన్‌లు సీఎంలుగా ఉన్నప్పుడు వారితో సీఎం హోదాలో కేసీఆర్ సమావేశమైతే తప్పులేదు కానీ.. సీఎంల హోదాలో రేవంత్‌రెడ్డి, చంద్రబాబులు సమావేశమైతే హరీశ్‌రావుకు తప్పొచ్చిందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.