Share News

డీ లిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:48 AM

డీలిమిటేషన్‌లో భాగంగా లోక్‌సభ నియోజకవర్గాలను రాష్ట్రాల వారీగా 50శాతం చొప్పున పెంచితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

డీ లిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం

  • సీఎం రేవంత్‌ చెప్పింది వంద శాతం నిజం

  • దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా దెబ్బతీసే కుట్ర

  • సంజయ్‌ మాటలను పట్టించుకోవాల్సిన పని లేదు

  • పొంగులేటిపై హరీశ్‌ అభియోగాలకు విలువ లేదు

  • మంత్రి సీతక్కపై బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలు సెన్స్‌ లెస్‌

  • క్యాబినెట్లో కోమటిరెడ్డి సోదరులిద్దరూ ఉంటే తప్పేంటి?

  • టీపీసీసీ చీఫ్‌ జగ్గారెడ్డి అంటూ..వెంకట్‌రెడ్డి ఫ్లోలో అన్నడు

  • దీనిపై ఇద్దరు బీసీ సోదరుల కామెంట్లు చూసి బాధపడ్డా

  • తెలంగాణకు దళితుడిని సీఎం ఎందుకు చేయలేదంటూ కేసీఆర్‌ను పదేళ్లలో ఎవరైనా అడిగారా?: తూర్పు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): డీలిమిటేషన్‌లో భాగంగా లోక్‌సభ నియోజకవర్గాలను రాష్ట్రాల వారీగా 50శాతం చొప్పున పెంచితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పింది నూటికి నూరు పాళ్లు వాస్తవమన్నారు. ఇది దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా దెబ్బతీసే కుట్రేనని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ఇక్కడి కేంద్ర మంత్రులు ఏమీ చేయలేరు.. మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లోనైతే సోనియాగాంధీకి చెప్పుకొనే స్వాతంత్రం ఉంటుందని, బీజేపీలో అలాంటి అవకాశమే లేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శల నేత అని, ఆయన ఏం మాట్లాడినా విలువ ఉండదని, పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో మంగళవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి సంగారెడ్డి అభివృద్ధి పనులపై నివేదిక ఇచ్చానని, ఈ నెల 30న లేదంటే మే నెలలో సంగారెడ్డిలో సీఎం పర్యటన ఉంటుందని చెప్పారు. మంత్రి పొంగులేటిపై హరీశ్‌రావు మోపిన అభియోగాలకు విలువ లేదన్నారు. ‘‘రెండున్నరేళ్లలో సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా భూమిని తీసుకున్నట్లు, భూముల అంశాల్లో తాను ఇన్‌వాల్వ్‌ అయినట్లు మీకు సమాచారం ఉందా అంటూ మంత్రి పొంగులేటి నన్ను అడిగారు. అలాంటి ఆరోపణలు ఏమీ లేవంటూ నేనే సర్టిఫికెట్‌ ఇచ్చాను’’ అని వెల్లడించారు. కొల్లూరు, ఉస్మాన్‌పూర్‌లో ఎకరం రూ.20 కోట్ల పలుకుతోందని, ఎవరు వేలు పెట్టినా భగ్గు మంటోందన్నారు. హరీశ్‌రావు మళ్లీ ఆరోపణలు చేస్తే.. పటాన్‌ చెరులో ఎవరు దందాలు చేశారో బయట పెడతానని హెచ్చరించారు.


2014 నుంచి మూడేళ్లపాటు జగ్గారెడ్డి ఎక్కడైనా భూములు సంపాదించాడా? అని బీఆర్‌ఎస్‌ నేతలు జల్లెడ పెట్టి వెతికారని, కానీ.. వాళ్లకేమీ దొరకలేదన్నారు. అలాగే, అంగన్‌వాడీలకు సెల్‌ ఫోన్ల విషయంలో మంత్రి సీతక్కపై బీఆర్‌ఎస్‌ నేతలు సెన్స్‌ లెస్‌ ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన పార్టీ నేతలకు కేసీఆర్‌ శిక్షణ ఇస్తే బాగుంటుందన్నారు. ప్రతి దాన్నీ ఇష్యూ చేస్తున్న సోషల్‌ మీడియాపై బ్యాన్‌ విధించాలన్నారు. కాగా, టీపీసీసీ చీఫ్‌ జగ్గారెడ్డి అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏదో ఫ్లోలో మాట్లాడారని, దీనిపై ఒకరిద్దరు బీసీ సోదరులు కామెంట్లు చూసి తాను బాధపడ్డానన్నారు. తమ ఊర్లో రెడ్డిలు, బీసీలం కలిసే ఉంటామన్నారు. మహేశ్‌గౌడ్‌ పేరును టీపీసీసీ చీఫ్‌గా ప్రతిపాదించింది తానేనని, రెడ్లంతా మద్దతు ఇస్తేనే మహేశ్‌గౌడ్‌ టీపీసీసీ చీఫ్‌ అయ్యాడన్నారు. తన భార్య బీసీ అని, వచ్చే ఎన్నికల్లో ఆమెను సంగారెడ్డి నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నానని చెప్పారు. కాగా, రాష్ట్ర క్యాబినెట్లో కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కొనసాగిస్తూనే రాజగోపాల్‌రెడ్డిని కూడా క్యాబినెట్లోకి తీసుకోవాలని, సీఎం రేవంత్‌రెడ్డికి తాను ఇదే చెబుతానని చెప్పారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడిగా, సీఎంగా ఓసీనే ఉన్నారని గుర్తు చేశారు. దళితుడిని తెలంగాణ సీఎంగా ఎందుకు చేయలేదని పదేళ్లలో ఎవరైనా కేసీఆర్‌ను ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

Updated Date - Apr 15 , 2026 | 04:48 AM