Share News

Jagga Reddy: జీవితంలో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయను

ABN , Publish Date - Jan 18 , 2026 | 04:54 AM

సంగారెడ్డిలో తాను ఓడిపోవడం వల్ల రాహుల్‌గాంధీని అవమానించినట్లయ్యిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆవేదన చెందారు.

Jagga Reddy: జీవితంలో సంగారెడ్డి  నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయను

  • రాహుల్‌గాంధీని సంగారెడ్డి ప్రచార సభకు పిలిచి అవమానించానేమోనని బాధపడ్డా

  • రాహుల్‌ నా భుజంపై చేయి వేసి.. నన్ను గెలిపించాలని ప్రచారం చేస్తే ఓడించారు

  • మరచిపోలేకపోతున్న.. నాకు అవమానం అనిపించింది

  • నా ఓటమికి కారణం పేదలు కాదు.. ఇక్కడి మేధావులు, పెద్దలే

  • సంగారెడ్డిలో నా భార్య నిర్మల పోటీచేసినా నేను ప్రచారానికి రాను: జగ్గారెడ్డి

  • సంగారెడ్డి పట్టణంలో ఇండ్లులేని పేదలతో ముఖాముఖి సభ

సంగారెడ్డి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సంగారెడ్డిలో తాను ఓడిపోవడం వల్ల రాహుల్‌గాంధీని అవమానించినట్లయ్యిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆవేదన చెందారు. సంగారెడ్డి పట్టణంలో ఇంటి స్థలం, సొంత ఇండ్లు లేని నిరుపేదలతో శనివారం జగ్గారెడ్డి ముఖాముఖి సభ నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 సంవత్సరంలో తాను 5500 మందికి ఇంటి స్థలం పట్టాలు ఇవ్వగా.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నిర్వీర్యం చేసి ఆ స్థలాన్ని ఇతర పనులకు కేటాయించారని ఆరోపించారు. అందుకే అప్పుడు పట్టాలు తీసుకున్నవారితో సభ ఏర్పాటు చేశానని వివరించారు. తాను గెలిస్తే ఇప్పటికే వాళ్లంతా సొంత ఇంటివారు అయ్యేవారని చెప్పారు. తన గెలుపు కోసం ఇందిరమ్మ మనవడు రాహుల్‌గాంధీ ఇదే సంగారెడ్డి గంజ్‌ మైదానంలో సభకు వచ్చారని.. తన భుజంపై చేయి వేసి గెలిపించాలని కోరితే ఓడించారని అసహనం వ్యక్తం చేశారు. ‘ఆరునెలల క్రితం ఢిల్లీలో కొందరు చర్చ పెట్టుకున్నప్పుడు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు గెలిచి మంచి పొజిషన్‌లో ఉన్నారు.. మరీ రాహుల్‌గాంధీ మనిషి జగ్గారెడ్డి ఎలా ఓడిపోయాడని మాట్లాడుకోవడం నాకు చాలా అవమానం కలిగించింది’ అని గుర్తుచేశారు. తన ఓటమికి కారణం పేద ప్రజలు కాదని.. ఇక్కడి పెద్దలు, మేధావులేనని స్పష్టం చేశారు. అందుకే జీవితంలో సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయనని, తన భార్య పోటీచేసినా ప్రచారం చేయబోనని ప్రకటించారు. రాష్ట్రంలో తాను ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తానని చెప్పారు. పేదవాళ్లు డబ్బులు తీసుకొని ఓటేస్తే పర్వాలేదు కానీ విద్యావంతులు, మేధావులు కూడా అదేపని చేశారని ఆయన అసంతృప్తిని వ్యక్తపరిచారు.

Updated Date - Jan 18 , 2026 | 04:54 AM