టార్గెట్ ఆర్కే!
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:41 AM
జగన్‌కు అధికారం జన హితం కోసం కాదు! తన కక్ష సాధించుకునేందుకే! ఈ విషయం ఇప్పటికే రుజువైంది. మళ్లీ అధికారంలోకి వస్తే మళ్లీ అదే చేస్తా అని స్వయంగా ప్రకటించుకున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేశారు.
ఆంధ్రజ్యోతిపైనా, ఎండీపైనా జగన్ అక్కసు.. రాధాకృష్ణను స్టేషన్ల చుట్టూ తిప్పుతా!
కార్యకర్తల్ని అరెస్టు చేసి కొడుతున్నారు
రాధాకృష్ణకూ అదే జరుగుతుంది
పార్టీ సమావేశంలో హెచ్చరికలు
తొలి సంతకం ‘ఆంధ్రజ్యోతి’ రద్దుపైనేనట
గుంటూరులో మోదుగుల మాట
అమరావతి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): జగన్‌కు అధికారం జన హితం కోసం కాదు! తన కక్ష సాధించుకునేందుకే! ఈ విషయం ఇప్పటికే రుజువైంది. మళ్లీ అధికారంలోకి వస్తే మళ్లీ అదే చేస్తా అని స్వయంగా ప్రకటించుకున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఏ నాయకుడైనా అధికారంలో వస్తే తొలి సంతకం ప్రజలకు మేలు చేసే నిర్ణయాలపై పెడతారు. కానీ... తమ నాయకుడు మాత్రం ‘ఆంధ్రజ్యోతి రద్దు, ఏబీఎన్ చానల్ రద్దు’పై సంతకం చేస్తారని వైసీపీ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి గుంటూరులో ఆవేశంగా ప్రకటించారు. వెరసి... ‘ఆంధ్రజ్యోతి’ పట్ల తమ అక్కసును, భయాన్ని ఈ రూపంలో వెల్లగక్కారు. బుధవారం తాడేపల్లి ప్యాలె్‌సలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు హెచ్చరికలు జారీ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఆయనను తిప్పిన పోలీసు స్టేషన్‌కు తిప్పకుండా తిప్పుతామని హూంకరించారు. ‘‘ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఎంత బాధో! దోచుకునేది.. పంచుకునేది.. తినుకునేది కట్ అయిపోతుందని! వైసీపీ శ్రేణులందరిపైనా అన్యాయమైన.. దుర్మార్గమైన మాటలు మాట్లాడతాడు. నేను ఇదే రాధాకృష్ణకు చెబుతున్నా! రేప్పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక.. నిన్ను తిప్పిన స్టేషన్‌కు తిప్పకుండా తిప్పుతాం. సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో చేసిన కామెంట్లపై కేసులు పెట్టి మా కార్యకర్తలను జైళ్లలో పెడుతున్నారు. కొడుతున్నారు. రేప్పొద్దున రాధాకృష్ణకు కూడా ఇదే జరుగుతుంది’’ అంటూ బెదిరింపులకు దిగారు.