పవన్‌వస్తే.. శాంతిభద్రతల సమస్య వస్తుందా?
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:22 AM
పవన్‌కల్యాణ్ వస్తే.. సభ పెట్టుకుంటే శాంతిభద్రతల సమస్య వస్తుందా?.. అనుమతి ఇవ్వకపోతే అది ప్రభుత్వ చేతగానితనం ఏం తెలివితక్కువతనం ఇది...
కాంగ్రెస్‌తో పవన్ మ్యాచ్ ఫిక్సింగ్: జగదీశ్ రెడ్డి
నల్లగొండ, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ‘‘పవన్‌కల్యాణ్ వస్తే.. సభ పెట్టుకుంటే శాంతిభద్రతల సమస్య వస్తుందా?.. అనుమతి ఇవ్వకపోతే అది ప్రభుత్వ చేతగానితనం ఏం తెలివితక్కువతనం ఇది’’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ మాటలు ఇంకా అపరిపక్వంగానే ఉంటున్నాయని.. ఆయనను ఎవరో ఏదో అన్నారని, లేని దాంట్లో, గాలిలో, శూన్యంలో ఏదో ఊహించుకుని ఏదో మాట్లాడేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా, తెలివితక్కువ మాటలు మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు. ఇవన్నీ.. కాంగ్రెస్ పార్టీ, పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో, తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కోసం ఆడుతున్న డ్రామాలేనన్నారు. ఆంధ్రా నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఆంధ్రాకు పోకుండా ఎవరూ ఎవరినీ ఆపలేరన్నారు. రాష్ట్రాల ఏర్పాటు గురించి పవన్‌కు తెలియదని, ఆయనకున్న జ్ఞానం అంతేనని అన్నారు. ఆయనకు ఎవరో రాసిస్తే చదివే అలవాటు ఉందని, మోదీ రాసిచ్చిందే ఈయన చదివాడన్నారు. ‘‘నేను ఇది చేస్తా, అది చేస్తా, నరుకుతా’’ అనే పిచ్చి మాటలు బంద్ చేసుకోవాలని పవన్‌కు సూచించారు. ఇక్కడ ఎవడినీ ఎవడూ ఆపలేడని, అందరి భవిష్యత్తునూ నిర్ణయించేది ప్రజలేనని వ్యాఖ్యాననించారు. అలాంటి ప్రజల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు.