kumaram bheem asifabad-తునికాకు సేకరణకు వేళాయె..
ABN , Publish Date - Apr 19 , 2026 | 10:59 PM
ఈ ఏడాది తునికి ఆకు సేకరణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో విశాలమైన అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతానికి ఆనుకొని చాలా గ్రామాలు ఉండగా ప్రతీ ఏడాది ఎండా కాలంలో వేసవి పంటగా భావించే తునికాకు సేకరణపై కూలీలు ఆశలు పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగానే సంబంధిత అధికారులు సైతం ఇప్పటికే టెండర్లు పిలిచి తునికాకు సేకరణ కోసం అడుగులు వేస్తున్నారు.
- జిల్లాలో 13 యూనిట్ల పరిధిలో 161 కల్లాలు ఏర్పాటు చేసే అవకాశం
- గ్రామీణ నిరుపేదలకు వేసవిలో ఆదాయ మార్గం
చింతలమానేపల్లి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది తునికి ఆకు సేకరణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో విశాలమైన అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతానికి ఆనుకొని చాలా గ్రామాలు ఉండగా ప్రతీ ఏడాది ఎండా కాలంలో వేసవి పంటగా భావించే తునికాకు సేకరణపై కూలీలు ఆశలు పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగానే సంబంధిత అధికారులు సైతం ఇప్పటికే టెండర్లు పిలిచి తునికాకు సేకరణ కోసం అడుగులు వేస్తున్నారు. ఎండా కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఉపాధి హామీ పనులు తప్ప వేరే పనులేమి ఉండవు. దీంతో తునికాకు సేకరణతో ఒక్కో కుటుంబం రోజుకు సుమారుగా రూ. 600- 1000 వరకు సంపాధించుకునే అవకాశం ఉన్నది. జిల్లాలో సుమారుగా 10వేల మంది వరకు ఉపాధి పొందుతారు. దీనికి తోడు బోనస్ అదనంగా రానున్నది. ఏప్రిల్ చివరి వారం నుంచి మే మొదటి వారంలో తునికాకు సేకరణ ప్రారంభం కానుంది. వెయ్యి కట్టలను ఒక్క స్టాండర్డ్ బ్యాగుగా పరిగణించి లెక్కలోకి తీసుకుంటారు. తునికాకు కూలీలతో పాటు గుత్తేదారులు, బీడీ కార్మికులకు ఈ ఉపాధి అండగా ఉండే అవకాశం ఉన్నది.
- 6.42 లక్షల ఎకరాల్లో..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 6.42 లక్షల ఎకరాల్లో అటవీ విస్తీర్ణం ఉండగా 2 డివిజన్లు ఉన్నాయి. 11 రేంజ్‌లు, 74 సెక్షన్‌లు, 13 యూనిట్లు ఉండగా 161 కళ్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. 23,400 స్టాండర్డ్ బ్యాగుల లక్ష్యంగా పెట్టుకున్నారు. స్టాండర్డ్ బ్యాగ్ అంటే ఒక్కో కట్టలో 50 ఆకులు ఉంటాయి. అలాంటివి వెయ్యి కట్టలు కలిపితే ఒక స్టాండర్డ్ బ్యాగ్ అవుతుంది. ఇలా 23,400 స్టాండర్డ్ బ్యాగుల లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో రెండు డివిజన్ల పరిధిలో తునికాకు సేకరణ జరుగనున్నది. తునికాకు కూలీలు తెల్లవారు జామునే ఆకు సేకరించేందుకు సమీప అటవీ ప్రాంతానికి వెళ్లి ఆకు సేకరించి కట్టలు కట్టి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కళ్లాల్లో ఆకుల కట్టలను విక్రయిస్తారు. దీని ద్వారా ఒక్కో కూలీ సుమారుగా రూ. 500-1000 వరకు సంపాదించే అవకాశం ఉన్నది. ఇవే కాకుండా ప్రభుత్వం కూలీలకు బోనస్ సైతం అందిస్తున్నది. సేకరించిన ఆకులను వేలం నిర్వహించి వచ్చిన ఆదాయంలో కూలీలకు తిరిగి బోనస్ రూపంలో అందిస్తారు. గతంలో 2015 వరకు బోనస్ డబ్బులు చెల్లించారు. ఆ తర్వాత నుండి నిలిచి పోయాయి. రెండేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం 2016-21 మద్య కాలానికి సంబంధించి ఒకే సారి జిల్లాకు రూ. 36 కోట్లు విడుదల చేశారు. అయితే ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కావడం, గుత్తేదారులు యూనిట్లు దక్కించుకోవడంతో తునికాకు సేకరణపై కూలీలు ఆశలు పెట్టుకున్నారు. తునికాకు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తున్న నేపథ్యంలో నిత్యావసరాల ధరలకు అనుగుణంగా కట్టధర పెంచాలని, బోనస్ బకాయిలు వెంటనే చెల్లించాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. తునికాకు సేకరణకు వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగినా ఆదుకోవాలని కూలీలు కోరుతున్నారు.