kumaram bheem asifabad- గంగాపూర్ జాతరకు వేళాయె
ABN , Publish Date - Jan 30 , 2026 | 10:51 PM
రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని గుట్లపై ప్రకృతి ఒడిలో వెలసిన బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తుల కొంగు బంగారంగా మారింది. ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి నాడు తిరుమల తిరుపతిలోని వేంకటేశ్వరస్వామి కొన్ని గడియల పాటు గంగాపూర్ ఆలయంలో కొలువుదీరి భక్తుల కోరికలు తీరుస్తారని ఇక్కడి ప్రజలకు ప్రగాఢ విశ్వాసం.
- ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
రెబ్బెన, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని గుట్లపై ప్రకృతి ఒడిలో వెలసిన బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తుల కొంగు బంగారంగా మారింది. ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి నాడు తిరుమల తిరుపతిలోని వేంకటేశ్వరస్వామి కొన్ని గడియల పాటు గంగాపూర్ ఆలయంలో కొలువుదీరి భక్తుల కోరికలు తీరుస్తారని ఇక్కడి ప్రజలకు ప్రగాఢ విశ్వాసం. దీంతో మాఘశుద్ధ పౌర్ణమినాడు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామి వారికి మొక్కులు సమర్పించుకుంటారు. ఇందు కోసం ఆలయ నిర్వహకులు ఏర్పాట్లు చేశారు.
- మూడు రోజుల పాటు..
రెబ్బెన మండలంలోని గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వరస్వామికి జాతర ఈ నెల 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో నిర్వహించడానికి ఆలయ కమిటీ, జిల్లా కలెక్టెర్ కె హరిత, ఎస్పీ నితికా పంత్‌ల ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు స్వామి వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేంవదుకు ఆలయ కమిటీ ఎదుట ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఫిబ్రవరి 1న మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా స్వామి వారిని దర్శనానికి తరలి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్ కోసం రోడ్డుకు ఇరువైపులా స్థలాలను చదును చేశారు. భక్తులు ఎండబారిన పడకుండా టెంట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పించారు. జాతరలో ప్లోఈసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా పరిసరాల్లో ఎలాంటి అపరిశుభ్రత లేకుండా చూడడానికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులను నియమించారు. మండలంలోని 12 మంది కార్యదర్శులను ఆయా పనుల పర్యవేక్షణకు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ స్థలాల్లో ఎక్కడిక్కడ బారికేడ్లు, ప్రముఖుల దర్శనం కోసం ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తున్నారు. సింగరేణి యజమాన్యం ఆధ్వర్యంలో జాతర పరిసరాల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. వైద్య సేవలు అందించేందుకు వైద్య శిబిరం, రెండు అంబులెన్స్‌లను అందుబాటలో ఉంచారు. జాతరకు రాష్ట్ర నలుమూలలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించనున్నారు.
- ట్రాఫిక్ అంతరాయం లేకుండా..
జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ అంతరాయం జరగకుండా దారి మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. తాండూరు, బెల్లంపల్లి, మంచిర్యాల వైపు నుంచి వచ్చే టూ, త్రీ వీలర్ వాహనాలు రెబ్బెన ప్లైఓవర్ మీదుగా వెళ్లి ఇండియాన్ అయిల్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సింగిల్‌గూడ రైల్వే అండర్పాస్ బ్రిడ్జి ద్వారా సింగిల్‌గూడ మీదుగా గంగాపూర్‌కు, ఫోర్ వీలర్స్ వాహనాలు రెబ్బెన బస్‌స్టేషన్ వద్ద యూటర్స్ తీసుకుని రైల్వే గేటు ద్వారా జాతరకు వెళ్లాలి. అలాగే ఆసిఫాబాద్ వైపు నుంచి వచ్చే టూ, త్రీ వీలర్ వాహనాలు ఇండియాన్ అయిల్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సింగిల్‌గూడ రైల్వే అండర్పాస్ బ్రిడ్జి ద్వారా సింగిల్‌గూడ మీదుగా గంగాపూర్‌కు జాతరకు వెళ్లాలి. జాతర నుంచి వాహనాల ద్వారా వెళ్లే వారు గంగాపూర్ న్యూ ఆర్చ్ నుంచి వెంచర్ మార్గం ద్వారా పల్లవీ బ్రిడ్జి మీదుగా బయటకు వెళ్లాలి. గంగాపూర్ కమాన నుంచి టూ, త్రీ వీలర్ అనుమతి లేదు. ఆసిఫాబాద్ వైపు వెళ్లే అన్ని వాహనాలకు గోలేటి ఎక్స్ రోడ్ దగ్గర యూటర్న్ చేయాలని, ఫోర్ వీలర్ వాహనాలు రెబ్బెనలోని గంగాపూర్ రైల్వే గేటు ద్వారా జాతరకు వెళ్లాలని పోలీసు శాఖ సూచనలు జారీ చేసింది.
జాతరకు భారీ భద్రత..
- ఎస్పీ నితికాపంత్
రెబ్బెన మండలం గంగాపూర్‌లో శని, ఆది, సోమవారాల్లో జరుగనున్న జాతరకు భారీ భద్రత ఏర్పాట్లు చేశాం. ఏఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో పాటు పోలీసు సిబ్బందితో గట్టి భద్రత చర్యలు తీసుకుంటున్నాం. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి శాంతి భద్రతను పర్యవేక్షిస్తున్నాం.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
- ఆలయ ఈవో వేణుగోపాల్ గుప్తా
గంగాపూర్ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశాం. ముఖ్యంగా క్యూలైన్లలో నిలబడే భక్తులకు ఎండ తగలకుండా షామియానాలను ఏర్పాటు చేశాం. అక్కడక్కడ మంచి నీటిని సౌకర్యం కల్పించాం. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను గుర్తించి బారికేడ్లు ఏర్పాటు చేశాం.