Share News

kumaram bheem asifabad-బాల్యాన్ని ‘నులి’పేస్తోంది...

ABN , Publish Date - Jul 12 , 2026 | 10:18 PM

పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించడం, శారీరక, మానసిక అభివృద్ధికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ప్రత్యేకంగా ప్రతి ఏటా డివార్మింగ్‌ కార్యక్రమాలను చేపడుతుంది. సోమవారం ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది

kumaram bheem asifabad-బాల్యాన్ని ‘నులి’పేస్తోంది...
లోగో

- వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడమే సమస్య

- జిల్లా వ్యాప్తంగా అల్బెండజోల్‌ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు

- నేడు నులిపురుగుల నివారణ దినోత్సవం

బెజ్జూరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించడం, శారీరక, మానసిక అభివృద్ధికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ప్రత్యేకంగా ప్రతి ఏటా డివార్మింగ్‌ కార్యక్రమాలను చేపడుతుంది. సోమవారం ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇప్పటికే డివార్మింగ్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. డివార్మింగ్‌ టాబ్లెట్లను అందుబాటులో ఉంచారు. సోమవారం అల్బెండజోల్‌ మాత్రలను అందజేసి పిల్లలకు వేస్తారు. జిల్లా వ్యాప్తంగా 1నుంచి 19ఏళ్లలోపు పిల్లలు 1,67,000మంది ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రభుత్వ. ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల్లో అల్బెండజోల్‌ మాత్రలు వేయనున్నారు.

వయసు వారీగా డోసు..

ఈ మాత్రలను వయసు వారీగా డోస్‌ అందిస్తారు. ఒకటి నుంచి రెండేళ్లు కలిగిన వారికి 400ఎంజీలో సగం 200ఎంజీ మాత్రను వేసుకోవాలి. మిగితా వారు 400ఎంజీ మాత్రను వేసుకోవాలి. మాత్రను బాగా నమలాలి. అల్పాహారం లేదా భోజనం చేసిన వారికే ఈ అల్బెండజోల్‌ మాత్రలను ఇవ్వాలని, ఖాళీ కడుపుతో ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదని వైద్యులు సూచిస్తున్నారు. రెండేళ్లలోపు పిల్లలకు సగం టాబ్లెట్‌ను, రెండేళ్లు పైబడిన వారికి మొత్తం టాబ్లెట్‌ను ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు.

అపరిశుభ్రత వల్లే..

అపరిశుభ్రతతోనే నులిపురుగులు పిల్లలకు సంక్రమిస్తాయి. ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే నులిపురుగులు వ్యాపిస్తాయి. చేతిగోర్లను శుభ్రంగా ఉంచుకోవాలి. గోర్లు పెరిగినప్పుడు వాటిని కత్తిరించుకోవాలి. లేదంటే వాటిలో మట్టిచేరి అనారోగ్యానికి కారణమవుతుంది. పరిశుభ్రమైన నీరు తాగాలి. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం వల్ల నులిపురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. భోజనం చేసేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. కూరగాయలను శుభ్రమైన నీటితో కడగాలి. ఆహార పదార్థాలపై ఎల్లప్పుడు మూతలు కప్పి ఉంచాలి.

కలిగే అనర్థాలు...:

నులిపురుగుల వల్ల పిల్లలకు అనేక అనర్థాలు కలుగుతాయి. ముఖ్యంగా 1నుంచి 19ఏళ్ల వయసుస్స ఉన్న వారిలో అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. నులిపురుగులనేవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు. వాటి ద్వారా శరీరంలో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. నులిపురుగుల నిర్మూలనతో రక్తహీనత నియంత్రణ, పోషకాల గ్రాహ్యతను మెరుగుపర్చే ప్రయోజనాలు కలుగజేస్తుంది.

ఏర్పాట్లు పూర్తి చేశాం..

- సీతారాం, జిల్లా వైద్యాధికారి

అల్బెండజోల్‌ మాత్రలను వేయడం కోసం అన్ని మండల కేంద్రాల్లో వైద్యసిబ్బంది, ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు, ఉపాధ్యాయులకు డివార్మింగ్‌పై అవగాహన కల్పించాం. జిల్లా వ్యాప్తంగా 1నుంచి 19ఏళ్ల వయసు గల పిల్లలను గుర్తించాం. వారందరికి మాత్రల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద మాత్రలు ఉంటా యి. చిన్నారుల్లో మానసిక శారీరక ఎదుగుదల కోసం ఈ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి. పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.

Updated Date - Jul 12 , 2026 | 10:18 PM