kumaram bheem asifabad- గుట్టుగా చేరుతోంది..
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:34 PM
భూసారం దెబ్బతీస్తోందని..పర్యావరణానికి అధిక శాతం ముప్పు కలిగించడం...క్యాన్సర్ కారకాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం గడ్డిమందును నిషేధించింది. అవసరమని అనుకుంటే సంబంధిత వ్యవసాయ అధికారులు పరిశీలించి చిట్టీ రాసి సీల్ వేస్తేనే రైతులు వాడుకోవాలి. పక్కన ఉన్న మహారాష్ట్రలో ఎలాంటి నిషేధం లేకపోవడంతో మన రైతులు సరిహద్దు ప్రాంతానికి వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేస్తున్నారు.
- తనిఖీల్లో నిషేధిత గడ్డిమందు పట్టుబడుతున్నా మారని వైఖరి
బెజ్జూరు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): భూసారం దెబ్బతీస్తోందని..పర్యావరణానికి అధిక శాతం ముప్పు కలిగించడం...క్యాన్సర్ కారకాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం గడ్డిమందును నిషేధించింది. అవసరమని అనుకుంటే సంబంధిత వ్యవసాయ అధికారులు పరిశీలించి చిట్టీ రాసి సీల్ వేస్తేనే రైతులు వాడుకోవాలి. పక్కన ఉన్న మహారాష్ట్రలో ఎలాంటి నిషేధం లేకపోవడంతో మన రైతులు సరిహద్దు ప్రాంతానికి వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేస్తున్నారు. పొలాల్లో, గట్లపైన పిచికారి చేసి ఆరోగ్యం దెబ్బతీసుకోవడంతో పాటు పర్యావరణ కాలుష్యానికి కారకులు అవుతున్నారు. జిల్ల్లాలో పత్తి, కంది, మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్నారు. పంటల మధ్య, చేనుగట్లపైన పెరుగుతున్న పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించుకోవడానికి కూలీల ఖర్చు అధికం అవుతుండటం, కూలీ కొరతను అధిగమించడానికి పర్యావరణానికి ముప్పు కలిగించే గడ్డిమందులను పిచికారి చేస్తున్నారు. పదేపదే మందులు వాడకుండా ఒక్కసారి వాడితే పంటకాలం ముగిసే వరకు మొక్కలు, గడ్డి మొలవకుండా నియం త్రించే నిషేధిత గడ్డిమందు వైపు ఎక్కువ శాతం మంది రైతులు మొగ్గుచూపుతున్నారు. వాడే ముందు వ్యవసాయ అధికారుల పరిశీలన, అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. సరిహద్దున ఉన్న బెజ్జూరు, చింతలమానేపల్లి, కౌటాల, దహెగాం, వాంకిడి తదితర మండలాల మీదుగా ఈ గడ్డిమందు జిల్లాకు చేరుతోంది. కొంతమంది రైతులు నేరుగా అక్కడి నుంచి తెచ్చుకుంటుండగా, ఇదే అదునుగా భావిం చిన కొందరు దళారులు కూడా మహారాష్ట్రలోని పట్టణాల నుంచి తీసుకొచ్చి అధిక ధర లకు విక్రయాలు జరుపుతున్నారు. జిల్లాలో అక్రమ రవాణా చేస్తూ అక్కడక్కడ కొందరు పోలీసులకు చిక్కుతున్నా పూర్తిస్థాయిలో నిషేధం జరగడం లేదు.