Share News

ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయండి

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:14 AM

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ మున్సిపాలిటీలో తమ పార్టీ తరఫున గెలిచి చైర్మన్‌ ఎన్నికలో బీఆర్‌ఎ్‌సకు మద్దతు తెలిపిన కౌన్సిలర్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకులు....

ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయండి

  • ఇస్నాపుర్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ సీరియస్‌

  • బీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చిన కౌన్సిలర్‌పై ఫిర్యాదు

పటాన్‌చెరు రూరల్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ మున్సిపాలిటీలో తమ పార్టీ తరఫున గెలిచి చైర్మన్‌ ఎన్నికలో బీఆర్‌ఎ్‌సకు మద్దతు తెలిపిన కౌన్సిలర్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మునిసిపాలిటీలోని ఎనిమిదో వార్డులో కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచిన పటోళ్ల మాధవిరెడ్డి చైర్మన్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు మద్దతు పలికి, వైస్‌ చైర్మన్‌ పదవిని తీసుకోవడం రాజకీయంగా కలకలం రేపింది. ఇస్నాపూర్‌ మునిసిపాలిటీలోని మొత్తం 26 వార్డుల్లో కాంగ్రెస్‌ 10, బీఆర్‌ఎస్‌ 12 స్థానాల్లో విజయం సాధించగా, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. ముగ్గురు స్వతంత్రులతో పాటు ఓ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూడా కాంగ్రె్‌సకు మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్‌ బలం 14కు చేరింది. దీంతో చైర్మన్‌ పీఠాన్ని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందని అంతా భావించారు. కానీ, ఓ స్వతంత్ర అభ్యర్థితో పాటు కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన పటోళ్ల మాధవిరెడ్డి బీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇచ్చారు. ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిల ఎక్స్‌అఫీషియో ఓట్లతో ఈ మునిసిపాలిటీ బీఆర్‌ఎస్‌ పరమైంది. ఎనిమిదో వార్డు సభ్యురాలు బీఆర్‌ఎ్‌సకు మద్దతు పలికిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా స్పందించారు. మాధవిరెడ్డికి వాట్సాప్‌ ద్వారా పార్టీ విప్‌ పంపించామని.. దానిని చూసి కూడా విప్‌ ధిక్కారానికి పాల్పడ్డారని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - Feb 20 , 2026 | 01:14 AM