‘భరోసా’ ఉన్నట్లా? లేనట్లా?
ABN , Publish Date - Jun 11 , 2026 | 01:11 AM
యాసంగి సీజన్ ముగిసింది. పండించిన ధాన్యం కూడా విక్రయించారు. వానాకాలం సీజన్ పనులు రైతులు మొదలుపెట్టారు. కానీ ఇప్పటికీ యాసంగి భరోసా సాయం ఎదురుచూపులనే మిగిలిస్తోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు సంక్షేమ ప్రధానంగా చెప్పుకుంటున్న రైతు భరోసా
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
యాసంగి సీజన్ ముగిసింది. పండించిన ధాన్యం కూడా విక్రయించారు. వానాకాలం సీజన్ పనులు రైతులు మొదలుపెట్టారు. కానీ ఇప్పటికీ యాసంగి భరోసా సాయం ఎదురుచూపులనే మిగిలిస్తోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు సంక్షేమ ప్రధానంగా చెప్పుకుంటున్న రైతు భరోసా పథకం మాత్రం రెండు ఎకరాల వరకే జమ చేశారు. యాసంగి సీజన్‌లో మూడు విడతలుగా రైతు భరోసా సహాయాన్ని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనుకున్నట్లుగానే మొదటి విడత మార్చి 22న, రెండో విడత ఏప్రిల్ 20న విడుదల చేసింది. ఇప్పటికే 50 రోజులు గడిచిపోయినా మూడో విడత పెట్టుబడి సాయంపై మాత్రం ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఆందోళన చేస్తున్నారు. మూడో విడత రైతు భరోసా ఉన్నట్లా, లేనట్లా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్ ప్రారంభంలోనే అందించాల్సిన భరోసా నిధులు ఆలస్యంగా చేపట్టింది. ఎకరానికి రూ 6 వేల చొప్పున మొదటి విడతలో ఒక ఎకరం భూమికి, రెండో విడతలో రెండు ఎకరాల వరకు రైతు ఖాతాల్లో నిధులు జమ చేశారు. మరో రూ 100 కోట్లకు పైగా భరోసా సాయం పెండింగ్‌లో ఉంది. మళ్లీ రైతులు సాగు పెట్టుబడి సాయం కోసం వడ్డీ వ్యాపారుల వైపు చూసే పరిస్థితి ఉందని వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పట్టా రైతులు ఎరువు ధరల పెంపుతో రైతులకు మరీ భారంగా మారింది. ఎరువులు, విత్తనాల కొనుగోలు సమయంలో మూడో విడత నిధులు విడుదల నిలిచిపోవడంతో నిరాశ చెందుతున్నారు. జిల్లాలో యాసంగి 1.93 లక్షల ఎకరాలు మీద పంటలు సాగు చేశారు. ఇందులో వరి ప్రధానంగా 1.83 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. దిగుబడి ధాన్యంలో పౌరసరఫరాల శాఖ ఇప్పవరకు 42,194మంది రైతుల నుంచి రూ 796.56 కోట్ల విలువైన 3.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
రెండు విడతల్లో 154.34 కోట్ల భరోసా సాయం..
రైతు భరోసా సాయంలో జాప్యం జరుగుతున్నా యాసంగి సీజన్ సంబంధించిన నిధులు వానాకాలం సీజన్‌లోనైనా ఉపయోగపడతాయని భావిస్తున్న రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి సీజన్‌లో మూడు విడతల్లో అందించే విధంగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికి రెండు విడతల్లో 1,41,415 మంది రైతులకు రూ 154 కోట్ల 34లక్షల 40వేల 221 నిధులు జమ చేశారు. జిల్లాలో 175 రెవెన్యూ గ్రామాల్లో యాసంగి సీజన్ ప్రారంభం నుంచి ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్న క్రమంలో మార్చిలో మొదటి విడతలో 1,41,415 మంది రైతులకు రూ 68 కోట్ల 23 లక్షల 1211 రైతు భరోసా సాయం నిధులు జమ చేశారు. రెండు విడతల్లో 1.41 లక్షల మంది రైతులకు రూ 154 కోట్ల 34 లక్షల 40 వేల 221 భరోసా సాయం నిధులు జమ చేశారు. ఇందులో 23478 మంది ఎస్సీ రైతులకు రూ 18.766 కోట్లు, 8106మంది ఎస్టీ రైతులకు రూ 8.62 కోట్లు, 1,09,831 మంది రైతులకు రూ.126.95 కోట్ల భరోసా డబ్బులు జమ చేశారు. మొదటి విడతలో జిల్లాలోని 1.41లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ 68 కోట్ల 23 లక్షల 1211 భరోసా సాయం జమ చేశారు. ఇందులో 23,478 మంది ఎస్సీ రైతులకు రూ 10.66 కోట్లు, 8106 మంది ఎస్టీ రైతులకు రూ 4.20 కోట్లు, 1,09,831 మంది రైతులకు రూ 53.35 కోట్ల భరోసా డబ్బులు జమ కానున్నాయి. గడిచిన యాసంగి, వానాకాలం సీజన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల ఖాతాల్లో రూ 2,299.57 కోట్లు జమ చేశారు. ఇందులో 2024-25 సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్‌లో 99,464 మంది రైతులకు 1,33,837.06 ఎకరాలకు రూ.80 కోట్ల 30 లక్షల 22వేల455 జమ చేశారు. 2025 సంవత్సరం వానాకాలం సీజన్లో 1,26,278 మంది రైతులకు 2,48,857.15 ఎకరాలకు సంబంధించి రూ 149 కోట్ల 27 లక్షల 47వేల 573 రైతుల ఖాతాలో చేశారు. గడిచిన యాసంగి, వానాకాలం సీజన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల ఖాతాల్లో రూ 2,299.57 కోట్లు జమ చేశారు. ఇందులో 2024-25 సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్‌లో 99,464 మంది రైతులకు 1,33,837.06 ఎకరాలకు రూ.80 కోట్ల 30 లక్షల 22వేల455 జమ చేశారు. 2025 సంవత్సరం వానాకాలం సీజన్లో 126278 మంది రైతులకు 24,8857.15 ఎకరాలకు సంబంధించి రూ 149 కోట్ల 27 లక్షల 47వేల 573 ఆయా రైతుల ఖాతాల్లో చేశారు.
మండలాల వారీగా రెండు విడతల్లో యాసంగి రైతు భరోసా..
మండలం రెవెన్యూ గ్రామాలు రైతులు వచ్చిన డబ్బులు
గంభీరావుపేట 18 13,532 రూ 12,93,85,705
ఇల్లంతకుంట 21 18,847 రూ 23,32,76,722
ముస్తాబాద్ 16 15,511 రూ 17,76,92,917
సిరిసిల్ల 5 5,135 రూ 3,80,68,604
తంగళ్ళపల్లి 16 14,193 రూ 14,99,77,030
వీర్నపల్లి 8 4,670 రూ 4,54,23,951
ఎల్లారెడ్డిపేట్ 17 13,416 రూ 13,74,79,792
బోయిన్‌పల్లి 16 11,492 రూ 13,08,69,829
చందుర్తి 11 10,906 రూ 13,27,55,160
కోనరావుపేట 21 13,594 రూ 15,32,34,606
రుద్రంగి 3 3,956 రూ 5,15,58,008
వేములవాడ 8 7,555 రూ 6,70,27,240
వేములవాడ రూరల్ 15 8,608 రూ 9,66,90,657
మొత్తం 175 1,41,415 రూ 154,34,40,221