Share News

గ్యాస్‌ సబ్సిడీ అంతేనా?

ABN , Publish Date - Jan 09 , 2026 | 12:08 AM

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకంలో భాగంగా వంట గ్యాస్‌ సబ్సిడీ అందడంలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.

గ్యాస్‌ సబ్సిడీ అంతేనా?

మహాలక్ష్మి పథకంలో రూ.500లకు అందని సిలిండర్‌ సబ్సిడీ

లబ్ధిదారుల నిరాశ

వంట గ్యాస్‌ సబ్సిడీ హుళక్కేనా..?

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకంలో భాగంగా వంట గ్యాస్‌ సబ్సిడీ అందడంలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. తెల్లరేషన్‌కార్డు దారులకు రూ.500లకే వంట గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నామని మంత్రులు, ఎమ్మెల్యేలు సభలు, సమావేశాల్లో చెబుతున్నారు. 2024 సెప్టెంబరులో సబ్సిడీ డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నదంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేరుతో లేఖలు వచ్చాయని, సబ్సిడీ మాత్రం రావడంలేదని ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వినియోగదారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ రూ.46.90 మాత్రమే వస్తున్నాయని పేర్కొంటున్నారు.

ఆంధ్రజ్యోతి, మోత్కూరు

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే వంటగ్యాస్‌ సిలిండ్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్‌ అధికా రంలోకి వచ్చిన వెంటనే రూ.500లకే వంటగ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని అమలు చేయడానికి లబ్ధిదారుడు రూ.500లు చెల్లించేలా, ప్రభుత్వం మిగతా డబ్బు (సబ్సిడీ రూపేణ) చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకోవడానికి గ్యాస్‌ కంపెనీలను, ఏజన్సీలను ప్రభుత్వం సంప్రదించగా అందుకు కంపెనీలు, ఏజన్సీలు అంగీకరించలేదు. దీంతో లబ్ధిదారుడు పూర్తి డబ్బు చెల్లించి సిలిండర్‌ తీసుకుంటే రూ.500 పోను మిగితా డబ్బు తాము లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో సబ్సిడీ కింద జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

గృహ వినియోగ సిలిండర్‌పై సబ్సిడీ ఇలా..

గృహ వినియోగ వంట గ్యాస్‌ సిలిండర్‌ను లబ్ధిదారుడు పూర్తి డబ్బు చెల్లించి తీసుకోవాలి. అందులో రూ.46.90 పైసలు కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. రూ.500 వినియోగదారుడు భరిస్తే మిగతా డబ్బు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుని ఖాతాలో జమ చేయా ల్సి ఉంటుంది. ఇప్పుడు సిలిండర్‌ ధర రూ.922 ఉంది. కేంద్ర ప్ర భుత్వం రూ.46.90పైసలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.375.10పైసలు లబ్ధిదారుని ఖతాలో జమ చేయాల్సి ఉంది. ఎప్పుడో ఓ సారి ఎవరో కొద్ది మందికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ వస్తున్నది తప్ప, లబ్ధిదారులకు రావడం లేదంటున్నారు. సబ్సిడీ తమకు రావడంలేదని లబ్ధిదారులు గ్యాస్‌ కార్యా లయానికి వెళ్లి అడిగితే తెలియదని, ప్రభుత్వమే మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని చెబుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,44,175 గృహ వినియోగ కనెక్షన్లు ఉండగా మహాలక్ష్మి పథకం కింద 1.16లక్షల కనెక్షన్లను ఎంపిక చేశారు. మహాలక్ష్మి పథకంలోని లబ్ధిదా రులకు మూడేళ్లు ఆ కుటుంబం వినియోగించిన సగటు సిలిండర్ల ఆధారంగా ఏడాదికి ఎన్ని సిలిండర్లు రూ.500లకు ఇవ్వాలన్నది నిర్ణయించారు.

రేషన్‌ డీలర్ల ద్వారా లేఖల పంపిణీ

2024 సెప్టెంబరులో మహాలక్ష్మి పథకంలో రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తున్నాం. సిలిండర్‌ అందిన తర్వాత నాలుగు రోజుల్లో సబ్సిడీ సొమ్ము మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుందంటూ రేషన్‌ డీలర్ల ద్వారా పౌరసరఫరాల శాఖ నుంచి లేఖలు పంపారు. జాప్యం జరిగితే 1967 లేదా 180042500333 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఆనాటి నుంచి కూడా అక్కడొకరికి, ఇక్కడొకరికి అన్నట్టు, ఎప్పుడో ఓ సారి మాత్రమే సబ్సిడీ జమ అవుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. అదీ 2024లో మాత్రమేనంటున్నారు. 2025లో సబ్సిడీ రాలేదని వినియోగదారులు పేర్కొంటున్నారు.

రెండు సార్లే సబ్సిడీ వచ్చింది

రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్‌ నుంచి మహాలక్ష్మి పథకంలో రూ.500లకే సిలిండర్‌ పథకం అమలు చేస్తోంది. 2024 ఎప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు (21నెలల్లో) ఎనిమిది సిలిండర్లు తీసుకున్నాను. తేదీ 25-11-2024లో ఒకసారి, అంతకుముందు ఒకసారి సబ్సిడీ ఖాతాలో జమ అయింది. 2024 నవంబరు తర్వాత ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.46.90పైసలు జమ అవుతున్నాయి రాష్ట్ర ప్ర భుత్వ సబ్సిడీ జమ కావడంలేదు.

గజ్జి మల్లేషం, మోత్కూరు

ఒక్క సారే వచ్చింది

మహాలక్ష్మి పథకం అమలు అవుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరు గ్యాస్‌ సిలిండర్లు తీసుకున్నాను. 2024 జూన్‌లో ఒక సారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ వచ్చింది. మళ్లీ రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూ.46.90పైసలు సిలిండర్‌ తీసుకున్న ప్రతి సారి వస్తున్నా యి. రాష్ట్రప్రభుత్వ సబ్సిడీ ఎందుకు రావడం లేదని గ్యాస్‌ కార్యాల యానికి వెళ్లి అడిగితే తెలియదంటున్నారు. ప్రభుత్వం గ్యాస్‌ డీలరు లబ్ధిదారుని నుంచి రూ.500 తీసుకుని సిలిండర్‌ ఇచ్చేలా చేయాలి.

వరకాంతం సంధ్య, ఆరెగూడెం

Updated Date - Jan 09 , 2026 | 12:08 AM