Azharuddin: నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్?
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:15 AM
కల్వకుంట్ల కవిత రాజీనామాతో ఖాళీ అయిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మంత్రి అజారుద్దీన్ పోటీ చేయనున్నారా....
హైదరాబాద్, జనవరి 9(ఆంధ్రజ్యోతి): కల్వకుంట్ల కవిత రాజీనామాతో ఖాళీ అయిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మంత్రి అజారుద్దీన్ పోటీ చేయనున్నారా? ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలన్న సిఫార్సు పెండింగ్‌లో ఉండటంతో కాంగ్రెస్ పెద్దలు ముందుజాగ్రత్త పడుతున్నారా?.. గాంధీభవన్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ ఇది. బీఆర్‌ఎస్ నుంచి సస్పెండైన కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో.. ఆమె ప్రాతినిధ్యం వహించిన ‘నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ’ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. మరోవైపు గవర్నర్ కోటాలో అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నియమించాలన్న సిఫార్సు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్లు ఉండటంతో గవర్నర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఆలస్యమైనా గవర్నర్ ఆమోదం లభిస్తుందన్న నమ్మకంతో అజారుద్దీన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గత ఏడాది అక్టోబరు 31న ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్.. నిబంధనల ప్రకారం ఆరు నెలలోగా అంటే ఏప్రిల్ 31 కల్లా శాసనసభ లేదా మండలిలో సభ్యుడు కావాలి. లేకుంటే మంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ముందుజాగ్రత్తగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్‌ను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకుంటామని, దానితో ‘స్థానిక’ ఎమ్మెల్సీగా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం తేలికేనని భావిస్తున్నట్టు సమాచారం.
మున్సిపల్ ఎన్నికల తర్వాతే..!
మున్సిపల్ ఎన్నికల తర్వాతే ఈ సీటుకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలే అందులో ఓటర్లుగా ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపాలిటీలు, పరిషత్తుల కాలపరిమితి ముగిసింది. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అవి పూర్తవగానే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో ఓటరు జాబితా రూపొందించి, ఉప ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపనుంది. పరిషత్ ఓటర్లు లేకున్నా.. మున్సిపల్ ఓటర్లతో ఉప ఎన్నికల ప్రక్రియ చేపట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.