Share News

kumaram bheem asifabad- సాగునీటి గోస

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:05 PM

రెక్కలు ముక్కలు చేసి పంటలు పండించే రైతన్నలు ఉన్నా వారికి సాగునీరు లేక వర్షాదార పంటలను వేస్తూ కాలం కలిసి రాక తీవ్రంగా నష్టపోతున్నారు. మూడు కాలాల పాటు సాగు నీరు అందితే ఇక్కడి పొలాలు పచ్చదనాన్ని సంతరించుకుంటాయి. బెజ్జూరు మండలంలోని మత్తడి స్ర్పింగ్‌ ఆనకట్ట జలాశయం ఉన్నా సాగు నీరందించే పరిస్థితి లేదు. కాలువలు మొత్తం ధ్వంసమయ్యాయి.

kumaram bheem asifabad- సాగునీటి గోస
శిథిలావస్థకు చేరిన తూము

- పిచ్చి మొక్కలతో నిండిపోయిన కాల్వలు

బెజ్జూరు, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): రెక్కలు ముక్కలు చేసి పంటలు పండించే రైతన్నలు ఉన్నా వారికి సాగునీరు లేక వర్షాదార పంటలను వేస్తూ కాలం కలిసి రాక తీవ్రంగా నష్టపోతున్నారు. మూడు కాలాల పాటు సాగు నీరు అందితే ఇక్కడి పొలాలు పచ్చదనాన్ని సంతరించుకుంటాయి. బెజ్జూరు మండలంలోని మత్తడి స్ర్పింగ్‌ ఆనకట్ట జలాశయం ఉన్నా సాగు నీరందించే పరిస్థితి లేదు. కాలువలు మొత్తం ధ్వంసమయ్యాయి. కాలువల్లో ఇసుక, పూడిక నిండి నీరవ్వలేని పరిస్థితి నెలకొంది. తూములు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో సాగు నీరు బయటకు పోకుండా ఆయకట్టు రైతులకు నీరందక పంటలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉంది. అయినా దీనిపై పాలకులు పట్టించుకోని కారణంగా ఆయకట్టు రైతాంగానికి పూర్తిస్థాయిలో నీరందడం లేదు.

ప్రత్యేక దృష్టి సారించిన నిజాం..

మండల కేంద్రంలోని ఐదు కిలో.మీటర్ల దూరంలోని పచ్చని అటవీ ప్రాంతంలో ఉబికి వస్తున్న జలాలను చూసి వృదాగా పోతున్న జలవనరులను ఒడిసి పట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో అప్పటి నిజాం రాజు 1903లో మత్తడి అటవీ ప్రాంతంలో ఆనకట్ట నిర్మించాడు. ఈ ప్రాంతానికి వేటకు వచ్చిన నిజాం రాజు అటవీ ప్రాంతంలో ఊట్ల ప్రాంతం నుంచి ఉబికి వస్తున్న జలాలను ఒడిసి పట్టి సాగునీటికి నీరు అందించి రైతుల పంటలు సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో మత్తడి స్ర్పింగ్‌ ఆనకట్టకు పునాది వేశాడు. దీని కింద సుమారు 800ఎకరాలకు పైగా పంట పొలాలకు సాగు నీరు అందేది. ఆయకట్టు కింద బెజ్జూరు, ఎల్కపల్లి, చిన్నసిద్దాపూర్‌ గ్రామాల రైతులు పంటలు సాగు చేస్తారు. క్రమంగా దీని ఆయకట్టు విస్తీర్ణం పూర్తిగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు కేవలం 200ఎకరాలకు పైగా మాత్రమే సాగు నీరందుతోంది. పాలకులు దీని మరమ్మత్తులపై పట్టించుకోకపోవడంతో ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో వృదాగా పోతున్న జలాలను సద్వినియోగం చేసుకోవాలన్న తపనతో ఏర్పాటు చేసిన జలాశయంపై ప్రస్తుత పాలకులు దీన్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో నిజాం ఆశయం నెరవేరకుండా పోతోందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుత కాలంలో వ్యవసాయానికి సాగు నీరుంటేనే రైతులు సాగు చేసే పంటలు పండి ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. అయితే దీనిపై ఎవ్వరు కూడా పట్టింపులేనితనంగా వ్యవహరిస్తుండటంతో రైతుల ఆశలు నెరవేరడం లేదు.

- మరమ్మతులు చేయని కారణంగా..

మత్తడి స్ర్పింగ్‌ ఆనకట్టకు మరమ్మతులు చేయని కారణంగా నిజాం ఆశయం నెరవేరడం లేదు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర హయాంలో దీని మరమ్మతుఉ చేపట్టారు. కాలువలు నిర్మించి, మత్తడి కొత్తగా నిర్మించినా ఇప్పుడు ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం నీటి కాలువలు పూర్తిగా ఇసుకతో నిండి పూడిక పెరిగింది. దీంతో కాలువల నుంచి సాగునీరు అందడం లేదు. మత్తడి కూడా శిథిలావస్థకు చేరడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. మత్తడికి లోపల నీరు ఆగేచోట కూడా పూర్తిగా ఇసుక నిండిపోయింది. దీంతో నీరంతా కాలవల ద్వారా వెళ్లకుండా పొలాలకు చేరడం లేదు. మత్తడి వద్ద ఏర్పాటు చేసిన తలుపులు కూడా శిథిలమయ్యాయి. దీని ఆయకట్టు కింద కొన్ని దశాబ్దాలుగా రైతులు రెండు పంటలను సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. ఇప్పుడు కేవలం ఒక పంటకు కూడా పూర్తిస్థాయిలో సాగు నీరందక దైన్యంగా మారింది.ప్రస్తుతం ఆయకట్టు రైతులు ఆయిల్‌ ఇంజన్ల ద్వారా కాలువల నుండి సాగునీటిని పొలాలకు మల్లిస్తున్నారు. అయినా పూర్తిస్థాయిలో రైతుల పంటలకు అందడం లేదు. దీనికి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టినట్లయితే రైతులకు రెండు పంటలకు పుష్కలంగా సాగు నీరందే అవకాశం ఉంది.

- ఇసుక మేటలు తొలగిస్తే ..

మత్తడి స్ర్పింగ్‌ ఆనకట్ట కాలువల్లో నిండిన ఇసుకను తొలగిస్తే రైతులకు మేలు కలిగే అవకాశం ఉంది. మత్తడి లోపల నీరు నిల్వ ఉండే చోట పూర్తిగా ఇసుక నిండడంతో సాగు నీరు నిల్వ లేకుండా పోతోంది. కాలువల్లో, మత్తడి లోపల నుంచి ఇసుకను తొలగిస్తే ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగు నీరందే అవకాశం ఉంటుందని రైతులు బావిస్తున్నారు. ఆ దిశగా పాలకులు చర్యలు తీసుకొని మరమ్మత్తులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా నిజాం కాలంనాటి జలాశయంపై పాలకులు చిన్నచూపు చూస్తుండటంతో రైతులు సాగు చేస్తున్న ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందడం లేదు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో మరమ్మత్తులకు ఇదే అనువైన సమయం. అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లయితే ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందే అవకాశం ఉంటుంది. వర్షాలు కురిసినట్లయితే మరమ్మత్తు పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. ప్రకృతిసిద్ధమైన జలవనరులపై పాలకులు ప్రత్యేక చొరవ తీసుకొని మరమ్మత్తులు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరమ్మతులు చేయించాలి..

- చటారి హన్మంతు, రైతు, ఎల్కపల్లి

మత్తడి స్ర్పింగ్‌ ఆనకట్టకు మరమ్మతులు చేయించాలి. దీని కింద గత కొన్ని దశాబ్దాలుగా పంటలు సాగు చేసుకుంటున్నాం. ఉబికి వచ్చే జలాలను ఒడిసిపట్టి కాలువలకు, మత్తడికి మరమ్మతులు చేపట్టాలి. దీని కింద వందల ఎకరాలు సాగు చేసుకుంటున్నాం. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.

Updated Date - Apr 26 , 2026 | 11:05 PM