ఫారం ఇవ్వకుండానే..ఇళ్లకు స్టిక్కర్లు
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:52 AM
హైదరాబాద్‌లో ఎస్‌ఐఆర్ సర్వే ప్రక్రియ ఇంకా గందరగోళం మధ్యే కొనసాగుతోంది. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తిస్థాయిలో గాడిన పడలేదు. కొందరు బీఎల్‌వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఓటర్లు చిరునామాలో లేరని యాప్‌లో నమోదు
ఫోన్ చేస్తే తమవద్దకే రావాలని సూచన
సర్ సర్వేలో ఎన్యుమరేటర్ల నిర్వాకం
శేరిలింగంపల్లి నియోజకవర్గం గౌలిదొడ్డిలోని ఓ ఇంటి గోడకు ఎస్‌ఐఆర్ స్టిక్కర్ వేశారు. కానీ, అందులో ఉండే ఒక్క ఓటరుకూ ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వలేదు. ఎన్యుమరేషన్ ఫారం ఇచ్చిన తర్వాతే స్టిక్కర్ వేయాలి.
మల్కాజిగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. తెలుగులో ఇస్తున్న ఎన్యుమరేషన్ ఫారం వారి అర్ధం కాకపోవడంతో తికమక పడుతున్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓ బీఎల్‌వో వెళ్లినప్పుడు పలు ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. మరుసటి రోజు ఆయన మరో ప్రాంతంలో ఫారాలు పంపిణీ చేస్తున్న సమయంలో ఓటర్లు ఫోన్ చేయగా.. తనవద్దకు వచ్చి ఫారం తీసుకోవాలని సూచించాడు.
హైదరాబాద్‌లో ఎస్‌ఐఆర్ సర్వే ప్రక్రియ ఇంకా గందరగోళం మధ్యే కొనసాగుతోంది. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తిస్థాయిలో గాడిన పడలేదు. కొందరు బీఎల్‌వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫారాలు పంపిణీ చేయకుండానే ఇళ్లకు స్టిక్కర్లు అంటిస్తున్నారు. ముఖ్యంగా బీఎల్‌వో విధులు నిర్వహిస్తున్న బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు నేరుగా ఇళ్లకు వెళ్లకుండా తెలిసిన వారితో పని చేయిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. తమ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి సర్వే చేయిస్తున్నట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, గోషామహల్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల పరిధిలో ఈ తరహా వ్యవహారం జరుగుతోంది. పలు ప్రాంతాల్లో బీఎల్‌వోలు వెళ్లినప్పుడు పలు ఇళ్లకు తాళం వేసి ఉంటోంది. కొందరు ఓటర్లు ఆ చిరునామాలో ఉండడం లేదు. దీంతో ఫారాల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే అదనుగా కొందరు బీఎల్‌వోలు కొన్ని ప్రాంతాలకు వెళ్లకుండా డోర్ లాక్, చిరునామా మారారని యాప్‌లో నమోదు చేస్తున్నారు. తమ ఇంటికి ఎవరూ రాలేదని ఓటర్లు స్థానిక రాజకీయ నాయకులను సంప్రదిస్తే.. తాము వచ్చినప్పుడు ఎవరూ లేరని బీఎల్‌వోలు చెబుతున్నారు. మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉంటున్న ఇతర రాష్ట్రాల వారికి కూడా తెలుగులో ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారాలే ఇస్తుండటంతో వాటిలో వివరాలు నమోదుచేసేందుకు ఓటర్లు తిప్పలు పడుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఇంగ్లి్‌షలో ముద్రించిన ఫారాలు పంపిణీ చేశారు.
- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ.