ఆమె ఐపీఎస్.. ఆయన ఐఏఎస్.. నిరాడంబరంగా పెళ్లి
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:38 AM
ఈ రోజుల్లో పెళ్లంటే? పెద్ద ఎత్తున షాపింగ్‌తో మొదలు పెడితే ప్రీ-వెడ్డింగ్ షూట్, మెహందీ, హల్దీ, సంగీత్, ఎదుర్కోళ్లు, వందల మంది అతిథిగణం మధ్య రిసెప్షన్ ఇలా...
చౌటుప్పల్ సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో ఒక్కటైన జంట
పెళ్లిళ్లకు ఆర్భాటాలొద్దనే సందేశాన్నివ్వాలనే
చౌటుప్పల్ రూరల్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఈ రోజుల్లో పెళ్లంటే? పెద్ద ఎత్తున షాపింగ్‌తో మొదలు పెడితే ప్రీ-వెడ్డింగ్ షూట్, మెహందీ, హల్దీ, సంగీత్, ఎదుర్కోళ్లు, వందల మంది అతిథిగణం మధ్య రిసెప్షన్ ఇలా రూ.లక్షలు, కోట్లలో ఖర్చు! పైగా ఓ రెండు నెలల ముందు నుంచే ఎన్నో పనులూ.. టెన్షన్లూ!! మరి.. ఆ వధూవరులు సివిల్ సర్వీస్ అధికారులైనప్పుడు ఆ హంగూ ఆర్భాటాలు ఇంకే స్థాయిలో ఉండాలి? కానీ.. ఆ జంట అత్యంత నిరాడంబరంగా వివాహబంధంతో ఒక్కటైంది. సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజీ చేసుకొని.. పెళ్లిళ్ల కోసం అప్పులు చేసి మరీ భారీగా ఖర్చు పెడుతున్న మధ్య తరగతి కుటుంబాలకు గొప్ప సందేశాన్నిచ్చింది. ఆ వధూవరులు.. సుర్కంటి శేషాద్రిని రెడ్డి (29), నెల్లూట్ల శ్రీకాంత్ రెడ్డి (28). శేషాద్రిని రెడ్డి స్వస్థలం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మునిసిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం. ఆమె 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. కుత్బుల్లాపూర్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్నారామె. శ్రీకాంత్ రెడ్డి స్వస్థలం ఏపీ కడప జిల్లా ఓల్డ్ గాంధీనగర్ చెన్నూర్. 2025 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్. శేషాద్రిని-శ్రీకాంత్ పెళ్లిని పెద్దలు నిర్ణయించారు. శనివారం చౌటుప్పల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో కొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఆర్భాటాలకు పోకుండా నిరాడంబరంగా పెళ్లిళ్లు జరగాలనే సందేశాన్నివ్వాలని నిర్ణయించామని.. ఇందుకు మార్గదర్శకులుగా ఉండాలనే ఇలా అతి సాధారణంగా వివాహం చేసుకున్నామని యువ దంపతులు తెలిపారు.