ఐపీఎల్ టికెట్లు బ్లాక్‌లో విక్రయం!
ABN , Publish Date - May 04 , 2026 | 04:17 AM
న్యాయమూర్తులు, ఇతర అధికారుల పేర్లు చెప్పి ఐపీఎల్ టికెట్లు తీసుకొని బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠాలోని ప్రధాన నిందితుడిని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
న్యాయమూర్తులు, అధికారుల పేర్లతో ఫోన్లు, పైరవీలు
ముఠాలోని ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీ, మే 3 (ఆంధ్రజ్యోతి): న్యాయమూర్తులు, ఇతర అధికారుల పేర్లు చెప్పి ఐపీఎల్ టికెట్లు తీసుకొని బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠాలోని ప్రధాన నిందితుడిని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. హెచ్‌సీఏ, మల్కాజిగిరి ఎస్‌బీ, ఎస్‌వోటీ బృందాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. అశోక్ అనే వ్యక్తి తన ముఠా సహకారంతో సీఎంవో, గవర్నర్ కార్యాలయం, న్యాయమూర్తులు, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, ముంబై క్రికెట్ అసోసియేషన్ల పేరుతో నకిలీ లెటర్ ప్యాడ్‌లు తయారుచేశాడు. ఆ లెటర్ ప్యాడ్‌లపై ఐపీఎల్ టికెట్లు కావాలని కోరుతూ రాసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు పంపాడు. ఆమేరకు టికెట్లు తప్పకుండా ఇవ్వాలని హెచ్‌సీఏ అధికారులకు ఫోన్లు చేసి మరీ దబాయించాడు. టికెట్ల కోసం ఇచ్చిన లెటర్ ప్యాడ్‌లు నకిలీవని గుర్తించిన హెచ్‌సీఏ అధికారులు మల్కాజిగిరి సీపీ సుమతికి సమాచారమందించారు. సీపీ ఆదేశాల మేరకు మోసగాళ్లను పట్టుకునేందుకు పథకం వేశారు. నిందితులు అడిగిన విధంగా ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఇచ్చి నిఘా పెట్టారు. ఆదివారం మ్యాచ్ సందర్భంగా బ్లాక్‌లో ఆ టికెట్లు విక్రయిస్తున్న వ్యక్తులతో పాటు ప్రధాన సూత్రధారి అశోక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.