Share News

700 కోట్ల ఐడీపీఎల్‌ భూములు అన్యాక్రాంతం

ABN , Publish Date - Jan 21 , 2026 | 05:52 AM

ఐడీపీఎల్‌ భూముల అన్యాక్రాంతంపై ‘తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ)’ అధికారులు బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో ....

700 కోట్ల ఐడీపీఎల్‌ భూములు అన్యాక్రాంతం

  • ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి 14 ఎకరాలు

  • ఐడీపీఎల్‌, రెవెన్యూ, సర్వే ఉద్యోగులే సూత్రధారులు

  • పోలీసులకు టీజీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ఫిర్యాదు

  • ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయని పోలీసులు!

హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్ర జ్యోతి): ఐడీపీఎల్‌ భూముల అన్యాక్రాంతంపై ‘తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ)’ అధికారులు బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో 14 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని తెలిపారు. ఈ మేరకు ఈ నెల 17న టీజీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ అనురాధ బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐడీపీఎల్‌ జనరల్‌ మేనేజర్‌, ఎస్టేట్‌ అధికారి భూముల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎన్‌ఐపీఈఆర్‌) ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని తెలిపారు. ఆ 14 ఎకరాల విలువ ప్రస్తుతం రూ.700 కోట్లు ఉంటుందని అంచనా. ప్రాగా టూల్స్‌ కంపెనీని ఆనుకొని ఉన్న ఈ భూముల ఆక్రమణకు సహకరించిన వారిలో ప్రైవేటు వ్యక్తులతోపాటు రెవెన్యూ ఉద్యోగుల ప్రమేయంపైనా ఫిర్యాదు చేశారు. కొందరు అధికారులు సహకరించడం వల్లే ఆక్రమణలు జరిగాయని టీజీఐఐసీ జెడ్‌ఎం ఫిర్యాదులో పేర్కొన్నారు. విలువైన భూముల ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. రెవెన్యూ రికార్డులను మార్చడం, పంచనామా సరిగా చేయకపోవడంతోపాటు ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 1960లో ఐడీపీఎల్‌ పరిశ్రమ కోసం 891.38 ఎకరాలు కేటాయించగా.. 2003లో పరిశ్రమ మూత పడింది. 2008లో ఈ భూములను టీజీఐఐసీకి కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. 2003లో ఐడీపీఎల్‌ మూసివేసిన తర్వాత 160 ఎకరాల భూమిని ఎన్‌ఐపీఈఆర్‌కు బదలాయించారు. గతంలో ఐడీపీఎల్‌ భూముల ఆక్రమణలకు సంబంధించి సంస్థ ఉద్యోగులు ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందించని పోలీసులు.. ఇప్పుడూ అదే ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 17న టీజీఐఐసీ జోనల్‌ మేనేజరు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని అధికారుల సమాచారం. ఒక ప్రభుత్వ సంస్థ ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అంశం చర్చనీయాంశమైంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, స్థానిక నేతల ఒత్తిడి వల్లే పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఐడీపీఎల్‌, ఎన్‌ఐపీఈఆర్‌, రెవెన్యూ, సర్వే అధికారులే సూత్రధారులంటూ టీజీఐఐసీ ఫిర్యాదు చేసి ఐదు రోజులు దాటినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదు. ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన మరుసటి రోజే సీఎం కార్యాలయ అధికారుల ఆదేశాల మేరకు మేడ్చల్‌ మల్కాజిగిరి కలెక్టర్‌.. పరిశ్రమ భూములను 22ఏ జాబితాలో పెట్టారు. ఆక్రమణదారులు, వారికి సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలకు ఆదేశించారు.


విజిలెన్స్‌ విచారణ.. హైలెవల్‌ సర్వే కమిటీ

ఐడీపీఎల్‌ భూముల ఆక్రమణలపై గత ఏడాది డిసెంబరు 11న ‘రూ.4000 కోట్ల ఐడీపీఎల్‌ భూములు కృష్ణార్పణం’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. వారిచ్చిన ప్రాథమిక నివేదిక అనంతరం.. దీనిపై లోతుగా విచారణ చేసేందుకు హైలెవల్‌ సర్వే కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కమిటీ విచారణ జరుపుతోంది. సర్వే నంబర్ల వారీగా పరిశ్రమకు కేటాయించిన భూమి ఎంత? ఏయే సర్వే నంబర్లలో ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురైంది? అనే వివరాలపై సర్కారుకు సమగ్ర నివేదిక ఇవ్వనుంది.

Updated Date - Jan 21 , 2026 | 05:52 AM