‘ఐపీఎల్’ పేరుతో సైబర్ కేటుగాళ్ల వల!
ABN , Publish Date - May 14 , 2026 | 03:56 AM
ఐపీఎల్ సీజన్ క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర తీశారు. ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా చూడొచ్చంటూ...
అభిమానులే లక్ష్యంగా ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్, ఉచిత టికెట్లంటూ నకిలీ వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ లింకులతో ఎర
వ్యక్తిగత, బ్యాంకింగ్ డేటా చోరీ చేసి ఖాతాలు ఖాళీ..
హెచ్చరించిన క్లౌడ్‌సెక్.. 600కి పైగా నకిలీ సైట్ల గుర్తింపు
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): ఐపీఎల్ సీజన్ క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర తీశారు. ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా చూడొచ్చంటూ, ఉచితంగా టికెట్లు గెలుచుకోవచ్చంటూ వివిధ పేర్లతో వందల సంఖ్యలో నకిలీ వెబ్ సైట్లు, ఆన్‌లైన్ లింకులను రూపొందించారు. క్రికెట్ అభిమానులను టార్గెట్ చేస్తూ సృష్టించిన ఈ వెబ్‌సైట్ల ద్వారా కోట్లాది మంది వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ డేటాను తస్కరించి కేటుగాళ్లు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సంస్థ క్లౌడ్‌సెక్ గుర్తించి హెచ్చరించింది. దీంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సుమారు 600కి పైగా నకిలీ వెబ్‌సైట్లను, 400కిపైగా ఫేక్ స్ట్రీమింగ్ లింక్‌లను సృష్టించారని.. అసలు స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లను పోలి ఉండేలా వీటిని రూపొందించారని, అధికారిక ప్రసార భాగస్వాముల లోగోలు, ఐపీఎల్ జట్ల ఫొటోలను ఉపయోగించి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని క్లౌడ్‌సెక్ వివరించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు సోషల్ మీడియా, టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ఫ్రీలింక్ పేరిట వీటిని వైరల్ చేస్తున్నారని వెల్లడించింది. ఇలాంటి లింక్‌లను ఓపెన్ చేసిన వెంటనే యూజర్లకు అనేక పాప్-ఆప్ ప్రకటనలు కన్పిస్తాయని.. మొబైల్ నంబర్ నమోదు చేయండి, ఫ్రీ యాక్సెస్ కోసం యాప్ డౌన్‌లోడ్ చేసుకోండని సందేశాలు వస్తాయని, కొన్ని వెబ్‌సైట్లు ఏపీకే ఫైళ్లు డౌన్‌లోడ్ చేయించి మొబైల్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ చేయిస్తున్నట్లు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి సైబర్ నేరగాళ్లు పంపిన మాల్వేర్ ఫోన్‌లోకి ప్రవేశిస్తే బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఫొటోలు, ఫోన్ కాంటాక్టులు, ఓటీపీలు, ఎస్‌ఎంఎ్‌సల సమాచారం నేరగాళ్లకు చేరే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మరికొన్ని వెబ్‌సైట్లు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు దారి మళ్లిస్తున్నాయని అధికారులు గుర్తించారు. రూ.500 పెట్టి రూ.50,000 వేలు గెలుచుకోండనే ప్రకటనలతో యువతను ఆకర్షిస్తున్నాయని, డబ్బు డిపాజిట్ అయిన తర్వాత అకౌంట్లు బ్లాక్ చేయడం, కస్టమర్ సపోర్ట్ కన్పించడం లేదనే ఫిర్యాదులు ఎక్కువయ్యాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులంటున్నారు. ఫ్రీ అనే పదాన్ని చూసి క్లిక్ చేయవద్దని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పద వెబ్‌సైట్లపై ఏ మాత్రం సమాచారమున్నా 1930కి రిపోర్టు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.