Farmers Buying Excess Urea in Bulk: యూరియా ఎక్కువ తీసుకున్న రైతులపై నిఘా!
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:06 AM
ఒకేసారి 40 నుంచి 50 బస్తాల యూరియా కొనుగోలు చేసిన రైతులపై వ్యవసాయశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. నాలుగు జిల్లాల్లో జరిగిన యూరియా....
40-50 బస్తాలు ఒకేసారి తీసుకున్నవారిపై విచారణ
4 జిల్లాలకు ప్రత్యేక బృందాలను పంపిన వ్యవసాయ శాఖ డైరెక్టర్
క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఒకేసారి 40 నుంచి 50 బస్తాల యూరియా కొనుగోలు చేసిన రైతులపై వ్యవసాయశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. నాలుగు జిల్లాల్లో జరిగిన యూరియా లావాదేవీలపై అనుమానాలు రావడంతో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ బి.గోపి బుఽధవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో వ్యవసాయ కమిషనరేట్ నుంచి ప్రత్యేక అధికారుల బృందాలు నిర్మల్, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలకు వెళ్లాయి. ఈ అధికారులు గురు, శుక్రవారాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలనచేసి శనివారంనాటికి వ్యవసాయ కమిషనరేట్‌కు నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నాలుగు జిల్లాల్లో ఎక్కువ యూరియా లావాదేవీలు జరిగిన కొనుగోలు కేంద్రాలు, రైతులు కొన్న యూరియా బస్తాల వివరాలను విచారణ అధికారులకు అప్పగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9 మంది, కామారెడ్డి జిల్లాలో 32 మంది రైతులు 40 నుంచి 50 బస్తాలు ఒకేసారి తీసుకున్నట్లు తెలిసింది. ఇతర జిల్లాల్లో కూడా 40-50 బస్తాలు ఒకేరోజు, ఒకేసారి తీసుకున్న రైతులను గుర్తించి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయా రైతులకు ఎంత భూమి ఉంది? ఏ పంటలు వేశారు? వాటికి ఎంత యూరియా అవసరం? ఇప్పటివరకు ఎంత యూరియా కొన్నారు? ఒకేసారి 40-50 బస్తాలు కొనాల్సిన అవసరం ఏంటి? తమ పంటలకోసమే యూరియా వినియోగిస్తున్నారా? బ్లాక్ మార్కెట్‌కు ఏమైనా తరలిపోతుందా? తదితర అంశాలపై ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టనున్నాయి.