kumaram bheem asifabad- ఇంటర్‌లో ఇంటర్నల్
ABN , Publish Date - Jun 17 , 2026 | 10:56 PM
ఇంటర్ విద్యలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై ఫస్టియర్‌లోనూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీకి ప్రాక్టికల్స్ నిర్వహించ నున్నారు. దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయ బట్టీ విధానానికి చరమగీతం పాడుతూ విద్యార్థుల్లో ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని సృతజనాత్మకతను వెలికితీస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ విధ్యావిధానంలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
వాంకిడి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ విద్యలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై ఫస్టియర్‌లోనూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీకి ప్రాక్టికల్స్ నిర్వహించ నున్నారు. దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయ బట్టీ విధానానికి చరమగీతం పాడుతూ విద్యార్థుల్లో ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని సృతజనాత్మకతను వెలికితీస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ విధ్యావిధానంలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. జాతీయస్థాయి ప్లస్ టూ స్థాయికి సరితూగేలా విద్యార్థులు ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచేం దుకు వీలుగా ఈ విద్యా సంవత్సరం నుంచే సరికొత్త మార్పులు సంస్కరణలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఆయా కళాశాలలకు బోర్డు ఆదేశాలు జారీచేసింది. ఇందుకు అవసరమైన సిలబస్‌ను సిద్ధం చేసి నూతన పాఠ్యపుస్తకాలను సైతం ముద్రించింది.
- గతంలో సెకండియర్ ముగింపులో..
ఇంతకాలం సైన్స్ (ఎంపీసీ, బైపీసీ) విద్యార్థులకు కేవలం సెకండియర్ ముగింపులో ప్రాక్టికల్స్ పరీక్షలు ఉండేవి. దీంతో విద్యార్థులు మొదటి సంవత్సరంలో కేవలం ధీయరీ చదవడానికే పరిమితమవ్వాల్సి వచ్చేది. ప్రాక్టికల్స్ జ్ఞానం వారికిపూర్తిగా లభించేదికాదు. దీనివల్ల వారు ప్రాక్టికల్స్ సహా పూర్తి సబ్జెక్టుపై నిష్టాతులయ్యేవారు కారు. ఈ లోపాన్ని సవరించేందకు గాను ఈ ఏడాది నుంచి ఫస్ట్ ఇయర్ లోనూ ప్రాక్టికల్స్ ప రీక్షల నిర్వహణను ప్రవేశపెట్టారు. గతంలో ఉన్న 30 మార్కుల ప్రాక్టికల్స్ విధానాన్ని రెండు విభాగాలుగా విభజించారు. దీని ప్రకారం మొదటి సంవత్సరంలో 15 మార్కులకు, సెంకండియర్‌లో మరో 15 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. దీనివల్ల విద్యార్థులకు ఫస్టియర్ నుంచే ప్రయోగాలపై ప ట్టు సాధించే అవకాశం లభిస్తుంది.
- పదో తరగతి మాదిరిగా..
పదో తరగతిలో అమలుచేస్తున్న ఇంటర్నల్ మార్కుల పద్ధతిని ఇంటర్‌లోనూ అమలు చేయనున్నారు. కేవలం పరీక్షల సమయంలో చదివి మార్కులు తెచ్చుకునే బట్టీ పద్దతికి స్వస్తిపలికి ఏడాది పొడవునా విద్యార్థుల నైపుణ్యాలను అంచనా వేసేందుకు యాక్టివిటీ బేస్ట్ లెర్నింగ్ (ఏబీఎల్) పేరిట ఇంటర్నల్ మార్కుల విధానాన్ని బోర్డు తెచ్చింది. మ్యాథ్స్ మార్కులు, మ్యాథమెటిక్స్ (1ఏ, 1బీ) సబ్జెక్టుల్లో ధియరీ పరీక్షను గతంలోని 75 మార్కు ల నుంచి తాజాగా 60 మార్కులకు తగ్గించనున్నారు. మిగిలిన 15 మార్కులను ఇంట ర్నల్స్ (ఏబీఎల్) కింద కేటాయిస్తారు.
- హ్యుమానిటీస్, భాషా సబ్జెక్టులు
సీఈసీ, హెచ్‌ఈసీ వంటి హ్యుమానిటీస్ గ్రూపులతో పాటు తెలుగు, ఇంగ్లిష్, సంస్కృతం వంటి భాషా సబ్జెక్టులు (లాంగ్వేజెస్)లో గతంలో ఉన్న 100 మార్కుల థియరీని 80 మార్కులకు తగ్గించనున్నారు. మిగిలిన 20 మార్కులను ప్రాజెక్ట్ వర్క్‌లు, ఆసైన్ మెంట్లు, క్లాస్‌రూం యాక్టివిటీస్ ఆధారంగా ఇంటర్నల్స్ రూపంలో ఇవ్వనున్నారు. కాగా ఇప్పటివరకూ ఎంపీసీ వారితో పాటు రాసే కఠినమైన గణితం(మ్యాథమెటిక్స్) పరీక్ష నుంచి ఎంఈసీ విద్యార్థులను తప్పించారు. వీరికి ప్రత్యేక మ్యాథ్స్ సిలబస్, క్వశ్చన్ పేపర్ ఉండనున్నాయి. వీరికి సైతం 80 మార్కుల థియరీ, 20 మార్కుల ఇంటర్నల్స్ ఉంటాయి.
- కొత్తగా ఏసీఈ..
మారుతున్న మార్కెట్ అవసరాలు, కార్పొరేట్ రంగంలో ఉద్యోగావకాశాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇంటర్ విద్యార్థుల కోసం సరికొత్త కోర్సును పరిచయం చేయనున్నది. ఇంటర్ బోర్డు కొత్తగా అకౌంటెన్సీ, కామర్స్, ఎకానమిక్స్ (ఏసీఈ) గ్రూపును ఈ ఏడాది నుంచే అందుబాటులోకి తీసుకువచ్చింది. సీఈసీలో సివిక్స్ బదులు పూర్తిస్థాయి అకౌంటెన్సీ పట్టుసాధించాలనుకునే విద్యార్థులకు ఈ గ్రూప్ ఒక అద్భుతమైన ప్రాత్యాయ్నంగా నిలవనున్నది. మిగిలిన ఆర్ట్స్ గ్రూపుల మారిదిగానే దీనికి కూడా 80 మార్కుల ధియరీ, 20 మార్కుల ఇంటర్నల్స్ విధానం వర్తిస్తుంది. కాగా ఈ నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఇంటర్ బోర్డు సరికొత్త పాఠ్యపుస్తకాలను ముద్రించింది. సబ్జెక్టు సులభంగా అర్థం క ఆవడానికి క్యూఆర్‌కోడ్‌లు, ఆకర్షణీయమైన రేఖా చిత్రాలు, ఇన్ఫర్మేషన్ బాక్స్‌లు, డిజిటల్ సిమ్యులేషన్స్‌ను ఈ పుస్తకాలలో పొందుపరిచారు.
- విద్యార్థుల పై ఒత్తిడి తగ్గుతుంది.
- చంద్రయ్య, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్
ఇంటర్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుది. జాతీయస్థాయి సరీక్షలైన జేఈఈ, నీట్ క్లాట్ వంటి పోటీ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచేందుకు ఈ మార్పులు(సంస్కరణలు) దోహదపడతాయి.