Brain Stroke: లెక్చరర్లు తిట్టడంతో మానసికంగా కుంగిపోయి..ఇంటర్ విద్యార్థినికి బ్రెయిన్ స్ట్రోక్
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:58 AM
ప్రీ ఫైనల్ పరీక్షకు ఆలస్యంగా వచ్చినందుకు ఓ ఇంటర్ విద్యార్థినిని లెక్చరర్స్ తీవ్రస్థాయిలో దుర్భాషలాడటంతో.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందా...
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
కాలేజీ వద్ద కుటుంబసభ్యుల నిరసన
లెక్చరర్స్, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి నేతల డిమాండ్
హైదరాబాద్ సిటీ/మారేడుపల్లి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రీ ఫైనల్ పరీక్షకు ఆలస్యంగా వచ్చినందుకు ఓ ఇంటర్ విద్యార్థినిని లెక్చరర్స్ తీవ్రస్థాయిలో దుర్భాషలాడటంతో.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందా బాలిక! ఆ బాధ మనసును తొలిచేస్తుంటే.. బ్రెయిన్ స్టోక్‌తో ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజ్‌గిరి మారుతి నగర్‌లో నివాసముంటున్న కార్పెంటర్ జి.నర్సింగ్ రావు, మాలతి దంపతుల కుమార్తె వర్షిణి.. వెస్ట్ మారేడుపల్లి ఎం.ఆర్‌ఎం.ఆర్ బాలికల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని. తన సోదరితో కలిసి రోజూ మల్కాజ్‌గిరి నుంచి బస్సులో కాలేజీకి వెళ్తుండేది. కళాశాలలో ప్రస్తుతం ప్రీఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే.. గురువారం వర్షిణి కాలేజీకి గంట ఆలస్యంగా రావడంతో ఫిజిక్స్, ఇంగ్లిష్ లెక్చరర్స్ లక్ష్మి, మధుర కోపంతో ఊగిపోయారు. ఆమెను అసభ్యకర పదజాలంతో దూషించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన వర్షిణి పరీక్ష రాసిన అనంతరం ఇంటికి వెళ్లి, జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పి బాధపడింది. కాలేజీకి వచ్చి లెక్చరర్స్‌తో మాట్లాడుతానని తల్లి ఆమెను ఓదార్చింది. అయితే.. అదే బాధలో ఉన్న వర్షిణి తీవ్ర తలనొప్పితో స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే తల్లిదండ్రులు ఆమెను మల్కాజ్‌గిరి ఆసుపత్రికి, ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సీటీ స్కాన్ చేసిన వైద్యులు ఆమె బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయి చనిపోయినట్టు చెప్పారు. ఆమెది సహజ మరణమని నిర్ధారించి, మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. వర్షిణి మరణానికి లెక్చరర్లే కారణమని పేర్కొంటూ శుక్రవారం కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో కాలేజీ వద్దకు తీసుకొచ్చారు. కళాశాల ప్రాంగణంలో బైఠాయించారు. ఆమె మృతికి కారణమైన లెక్చరర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వారితో గొంతు కలిపిన కళాశాల విద్యార్థులు... లెక్చరర్స్ అసభ్యకరంగా దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు.. విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న ఎంఆర్పీఎస్ నేతలు, ఓయూ స్టూడెంట్స్ కాలేజీ వద్దకు వచ్చి ధర్నా నిర్వహించారు. లెక్చరర్స్‌తో పాటు.. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వర్షిణి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. వర్షిణి పట్ల లెక్చరర్స్ అసభ్యకరంగా మాట్లాడారన్న విషయం తనకు తెలియదని ప్రిన్సిపాల్ నాగలక్ష్మి అన్నారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.