డ్రగ్స్ కేసులో ముమ్మర దర్యాప్తు
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:13 AM
మెయినాబాద్ ఫాంహౌస్ కాల్పులు, డ్రగ్స్ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితులు రోహిత్‌రెడ్డితో పాటు రితీశ్‌రెడ్డి, నమిత్ శర్మలను ప్రత్యేక దర్యాప్తు బృందం.....
సిట్ కస్టడీకి ప్రధాన నిందితులు
వేర్వేరుగా ముగ్గురు నిందితుల విచారణ
విమాన ప్రయాణ టికెట్లు ముందుంచి..ట్రావెల్ హిస్టరీపై కూపీ లాగిన పోలీసులు
నేడు ఫాంహౌస్‌కు తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/శంషాబాద్ రూరల్/ మెయినాబాద్)
మెయినాబాద్ ఫాంహౌస్ కాల్పులు, డ్రగ్స్ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితులు రోహిత్‌రెడ్డితో పాటు రితీశ్‌రెడ్డి, నమిత్ శర్మలను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మంగళవారం ఉదయం కస్టడీకి తీసుకుని విచారణ మొదలుపెట్టింది. తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ కేసును విచారించేందుకు ప్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు నేతృత్వంలో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో ప్రధాన నిందితులైన రోహిత్‌రెడ్డి, నమిత్ శర్మ, రితీశ్‌రెడ్డిలను మంగళవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి వేర్వేరుగా విచారించారు. సీపీ సుధీర్‌బాబుతో పాటు చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం. రవీందర్ రెడ్డి, షాద్‌నగర్ డీసీపీ సీహెచ్ శిరీష, ఈగిల్ ఫోర్స్ డీఎస్పీ బుచ్చయ్య.. నిందితులను సుధీర్ఘంగా విచారించారు. ఇప్పటికే స్టేషన్ బెయిల్‌పై విడుదలైన మిగతా నిందితుల నుంచి వివరాలు రాబట్టిన సిట్ కస్టడీకి తీసుకున్న ప్రధాన నిందితులనుంచి మరింత కీలక సమాచారం రాబట్టేయత్నం చేసినట్లు సమాచారం. ఆ రోజు పార్టీలోకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు సరఫరా చేశారు? ఎప్పటి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు? ఈ పార్టీకి ఇంకా ఎవరైనా రావాల్సి ఉందా? అనే విషయాలపై కూపీలాగారు. నిందితులుగా తేలినవారంతా ఫాంహౌ్‌సకు ఎలా చేరుకున్నారు..? వారిలో కొందరు సుదూర ప్రాంతాల నుంచి రావడంతో వారి ట్రావెల్ వివరాలను రాబట్టారు. కొందరు నిందితుల ట్రావెల్ వివరాలను దాచిపెట్టేయత్నం చేయడంతో పోలీసులు ప్రధాన నిందితుల ఎదుట విమాన ప్రయాణ టికెట్లు ఉంచి ప్రశ్నించినట్లు తెలిసింది. ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ తాను తిరుమల దైవదర్శనానికి వీఐపీ టికెట్ కోసం హైదరాబాద్ వచ్చినట్లు విచారణాధికారుల ఎదుట చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కోర్టు ఆదేశాల మేరకు నిందితుల తరఫున లాయర్ సమక్షంలో విచారణ జరిపారు. కొంతసేపు నిందితుల తరఫు లాయర్ ఎదుట, మరికొంత సేపు అద్దాలు ఉన్న గదిలో లాయర్‌కు కనిపించే విధంగా విచారణ జరిపారు. బుధ, గురువారం రోజుల్లో లోతుగా విచారణ జరుగుతుందని, తొలిరోజు నిందితుల వాదనలు వినేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు విచారణాధికారి ఒకరు తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ కేసు విచారణలో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్టేషన్ బెయిల్‌పై ఉన్న నిందితుల నుంచి ఇప్పటికే సిట్ పలు సంచలన విషయాలను రాబట్టింది. ప్రధాన నిందితుడు రోహిత్ రెడ్డి గత ఏడాది కాలంగా డ్రగ్స్ ముఠాతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించింది. డ్రగ్స్ సప్లయిర్ అభిషేక్ సింగ్‌తో పాటు తాజాగా మరో పేరు బయటకు వచ్చింది. రాకేశ్ వర్మ అనే వ్యక్తి డ్రగ్స్ సప్లయిలో కీలకంగా ఉన్నట్లు గుర్తించారు. బుధవారం దర్యాప్తు అధికారులు నిందితులను మెయినాబాద్ ఫాంహౌస్‌కు తీసుకువెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయ నున్నారు. అక్కడనుంచి తిరిగి శంషాబాద్ పీఎస్కు తీసుకొచ్చి మళ్లీ విచారించనున్నారు. నిందితులకు పీఎస్లోనే బస, భోజనం ఏర్పాట్లు చేశారు.
అభిషేక్ కనిపించడంలేదని ఫిర్యాదు
ఈ డ్రగ్స్ కేసులో కీలకమైన డ్రగ్‌సప్లయిర్ అభిషేక్ సింగ్ ఎక్కడ? అనేది ఇంకా తెలియడం లేదు. మూడు రోజుల కిందట అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు ప్రచారం జరిగింది. పోలీసులు మాత్రం దీనిపై ఎలాంటి ధ్రువీకరణ చేయలేదు. అయితే అనూహ్యంగా అభిషేక్ సింగ్ తండ్రి సోమవారం రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో తన కుమారుడు అభిషేక్ సింగ్ ఈనెల 16 నుంచి కనిపించడలేదని ఫిర్యాదు చేశారు.
కేవలం ఆరోపణలు మాత్రమే
నిందితుల తరఫు అడ్వకేట్ శ్రీకాంత్ రెడ్డి
ఫాంహౌస్‌లో ప్యామిలీ పార్టీనే జరిగిందని, పార్టీలో డ్రగ్స్ సేవించారనేది కేవలం ఆరోపణలు మాత్రమేనని నిందితుల తరఫు లాయర్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ జరిగిన రోజు పోలీసులు కోర్టుకు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో ఏ-4గా ఉన్న కౌశిక్‌రవి వద్ద మాత్రమే డ్రగ్స్ ఉన్నట్లు చూపించారన్నారు. డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అనేది ఎఫ్‌ఎ్‌సఎల్ రిపోర్టులో తెలుస్తుందని చెప్పారు. ఫాంహౌ్‌సలో గన్ ఫైరింగ్ అనేది కూడా ఆరోపణలు మాత్రమేనని, కేసు దర్యాప్తు జరుగుతోందని, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి లోతుగా మాట్లాడలేమని తెలిపారు.