Deputy CM Bhatti Vikramarka: ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:48 AM
పిల్లలు ప్రపంచంతో పోటీపడేలా అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రభుత్వం డ్రీమ్ ప్రాజెక్టు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
ఈ స్కూళ్ల నిర్మాణం పూర్తి చేసే బాధ్యత జిల్లా కలెక్టర్లదే..
వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): పిల్లలు ప్రపంచంతో పోటీపడేలా అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రభుత్వం డ్రీమ్ ప్రాజెక్టు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ప్రజాభవన్ నుంచి ఆయన జిల్లా కలెక్టర్లు, ముఖ్యకార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం పూర్తి చేసే బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్లదేనని చెప్పారు. టెండర్లు పూర్తయిన చోట మంత్రి లేదా స్థానిక ఎమ్మెల్యేతో భూమి పూజ చేయించాలని, భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి తేదీలను ఖరారు చేయాలని ఆదేశించారు. ప్రతి వారం స్కూళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్ష జరపాలని, నెలలో ఒకసారి క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సూచించారు. నిధులకు ఇబ్బందిలేదని, ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులను చెల్లించనున్నట్టు చెప్పారు. ఈ పాఠశాలలు దేశంలోనే ఒక రోల్ మోడల్‌గా, గేమ్ చేంజర్లుగా మారనున్నాయన్నారు. అగ్రిమెంట్లు పూర్తి చేసుకున్న 15 రోజుల్లోగా కాంట్రాక్టర్లు పని ప్రారంభించకపోతే కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరానికి అత్యధిక శాతం స్కూళ్లు అందుబాటులోకి రావాలని ఆదేశించారు. కాగా ప్రజలకు నిబద్ధతతో సేవలు అందించాలని గ్రూప్-1ట్రెయినీలకు భట్టి సూచించారు. ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొంది గ్రూప్-1 సాధించినవారికి ప్రజాభవన్‌లో మెమొంటోలను అందించారు. భట్టి మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థులు సర్వీసులో చేరాక ఆయా వర్గాలకు దన్నుగా నిలవాలని సూచించారు.