Share News

ఇక రిజిస్ట్రేషన్‌తో పాటు సర్వే మ్యాప్‌

ABN , Publish Date - Mar 27 , 2026 | 04:31 AM

ఇంటిగ్రేటెడ్‌ భూభారతి పోర్టల్‌ ద్వారా భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలో సర్వే మ్యాప్‌ను అందజేస్తామని, ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్‌ 2 నుంచి ఎంపిక చేసిన ఐదు మండలాల్లో...

ఇక రిజిస్ట్రేషన్‌తో పాటు సర్వే మ్యాప్‌

  • ఏప్రిల్‌ 2 నుంచి 5 మండలాల్లో ఇంటిగ్రేటెడ్‌ భూభారతి కింద ప్రయోగాత్మకంగా అమలు

  • ఇబ్బందులు గుర్తించాక మార్పులుచేర్పులు

  • ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి

  • ఒక్క క్లిక్‌తో వివరాలు: మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, మార్చి26 (ఆంధ్ర జ్యోతి): ఇంటిగ్రేటెడ్‌ భూభారతి పోర్టల్‌ ద్వారా భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలో సర్వే మ్యాప్‌ను అందజేస్తామని, ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్‌ 2 నుంచి ఎంపిక చేసిన ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. నారాయణ పేట జిల్లా కోస్గి, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, ఖమ్మం జిల్లా కూసుమంచి, కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలాల్లో దీన్ని అమలు చేస్తామని తెలిపారు. తొలిదశలోని ఇబ్బందులను గుర్తించి, అవసరమైన మార్పులు చేశాక ఇంటిగ్రేటెడ్‌ భూభారతి పోర్టల్‌ సేవలను రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెస్తామన్నారు. ఈ నూతన విధానం వల్ల ఒకే క్లిక్‌తో భూముల వివరాలన్నీ తెలుస్తాయని, సర్వే నుంచి రిజిస్ట్రేషన్‌ వరకు అన్నీ సేవలు ఒకే గొడుకు కిందకు వస్తాయని, ప్రతి సర్వే నంబరుకు భూధార్‌ నంబరు ఉంటుందని వివరించారు. రైతులకు పారదర్శకమైన సేవలను అందించడమే లక్ష్యంగా భూ పరిపాలనలో ఈ విధానాన్ని నూతన శకంగా అభివర్ణించారు. సచివాలయంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, సర్వే విభాగాల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. భూ పరిపాలన సేవలను వేగవంతంగా అందించేందుకు రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్‌ విభాగాలను ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చేలా భూ భారతి పోర్టల్‌ను అభివృద్ధి చేసినట్లు వివరించారు. ప్రతి భూ లావాదేవీ వివరాలు కనిపించేలా పారదర్శకంగా ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో సర్వే మ్యాపును జతపరిచే నిబంధనను అమలు చేయడం వల్ల భూ వివాదాలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఐదు మండలాల్లో ప్రతి సర్వే నంబరుకు భూధార్‌ కార్డు కూడా ఇస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నక్షాలేని ఐదు గ్రామాల్లో రీ సర్వే నిర్వహించి భూధార్‌ నంబరును కేటాయించినట్లు చెప్పారు. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్‌ నంబరు ద్వారా లాగిన్‌ అయ్యాక అవసరమైన సమాచారం లభిస్తుందన్నారు. సర్వేకు సంబంధించిన సేవలు, సవరణలు, అప్పీళ్లు, రిజిస్ట్రేషన్‌ సేవలు, సిటిజన్‌ డ్యాష్‌బోర్డుకు సంబంధించి మై ల్యాండ్‌ పోర్టుపోలియో, నాలా ఆర్డర్స్‌, రిజిస్ట్రేషన్స్‌ డాక్యుమెంట్‌ వివరాలు, ఫీడ్‌ బ్యాక్‌ వ్యవస్థ, సంబంధిత అధికారుల వివరాలు, ఆర్వోఆర్‌, భూధార్‌ నంబర్లు, దరఖాస్తుదారు వివరాలు, మ్యుటేషన్‌, ఈసీ, మార్కెట్‌ విలువలు, విలేజ్‌ మ్యాప్‌, సర్వే నంబర్ల వారీ మ్యాప్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. రిజిస్ట్రేషన్‌,, ఇతర భూసేవలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతిదశలో సంబంధిత వివరాలు సంక్షిప్త సందేశం ద్వారా తెలియజేస్తామన్నారు. ధరణి పోర్టల్‌లో 36 మాడ్యుళ్లు ఉంటే.. భూభారతిలో అన్నింటినీ ఒకే చాప్టర్‌ కింద తీసుకొచ్చామన్నారు. త్వరలోనే భూభారతి పోర్టల్‌ను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

Updated Date - Mar 27 , 2026 | 04:31 AM