kumaram bheem asifabad-సందేహాల బీమా.. కల్పించాలి ధీమా
ABN , Publish Date - Nov 29 , 2026 | 10:23 PM
కుటుంబ యజమాని తోడు కరువైనప్పుడు.. ఆ కుటుంబానికి జీవన భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు చేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిర మ్మ కుటుంబ బీమా పథకంలో నమోదుకు రేషన్ కార్డు కీలకంగా నిలుస్తోంది
చింతలమానేపల్లి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కుటుంబ యజమాని తోడు కరువైనప్పుడు.. ఆ కుటుంబానికి జీవన భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు చేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిర మ్మ కుటుంబ బీమా పథకంలో నమోదుకు రేషన్ కార్డు కీలకంగా నిలుస్తోంది. ఈ పథకం వర్తించడానికి లబ్ధిదారులకు కార్డు ప్రమాణికంగా మారింది. కాగా రేషన్ కార్డు ఆధారంగానే రాష్ట్ర సర్కార్ కుటుంబాన్ని గుర్తిస్తుండడంతో కార్డులు లేని వారికి ఈ పథకం వర్తించకుండా పోతోంది. కుమరం భీం జిల్లాలో 1,66,016 రేషన్ కార్డులు ఉన్నాయి., ఇందులో ప్రతీ షాపు పరిధిలో 10 నుంచి 12 శాతం కార్డుల్లో ఒక్కరే సభ్యులున్నారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా సుమారు 30 వేల మంది లబ్ధిదారులు తమ రేషన్ కార్డుల్లో ఒక్కరే నమోదు ఉన్నట్టు తెలుస్తోంది. బీమా పథకం వర్లించాలంటే కనీసం కార్డులో ఇద్దరు సభ్యులు ఉండాలి. ఒకరు బీమాదారు, మరొకరు నామినీ, కానీ దంపతుల్లో ఒకరు పోయి మరొకరు మిగిలిన వారు, సంతానం లేని వారి నమోదు కుదరడం లేదు. సంతానం ఉన్న వారు మరో కుటుంబంగా మారాడంతో ఒంటరి వారికి బీమా అవకాశం దూరమవుతోంది. సమీప బంధువులను నామినీగా చేర్చాలంటే వారు ఇంకోచోట రేషన్‌కార్డులో చేరి ఉంటే అక్కడ తొలగించి ఒంటరిగా ఉన్నవారి కార్డులో చేర్చాలంటున్నారు. ఇది గడువులోగా సాధ్యమయ్యేలా లేదని చెబుతున్నారు. ప్రభుత్వం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా ప్రతీ కుటుంబానికి సహజ, ప్రమాద మరణానికి రూ.5 లక్షల బీమా కవరేజ్ వర్తిస్తుంది. ఈ బీమాకు ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. పాలసీ ప్రారంభమైన నాటి నుంచి ఒక ఏడాది మాత్రమే ఈ బీమా కవరేజ్ ఉంటుంది. కాగా రేషన్ కార్డు ఆధారంగానే కుటుంబాన్ని పరిగణలోకి తీసుకొని అందులో 18-59 ఏళ్ల మధ్యనున్న ఒకరికి కుటుంబ పెద్దగా పేర్కొంటు వారికే బీమా రక్షణ కల్పిస్తారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా కార్మిక, మత్స్యకార, గౌడ, నేతన్న తదితర బీమా పథకాలు యథాతథంగా కొనసాగిస్తూ వాటి పరిధిలోకి రాని వారందరికి ఈ పథకం వర్తిస్తుంది.
- పథకంలో కీలకంగా..
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా 2026 పథకంలో రేషన్‌కార్డు కీలకంగా నిలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో మున్సిపల్ వార్డుల్లో ఈ నెల 19 నుంచి డిసెంబరు 18 వరకు ఈ పథకంలో నమోదు చేసుకుంటున్నారు. ఈ నమోదు కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో తొలుత రేషన్ కార్డు నంబరు ఎంటర్ చేయగానే కుటుంబ సభ్యుల వివరాలు వస్తాయి. ఇందుల్లోంచి యాజమానిని ఎంచుకొని మిగితా వారిలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ సభ్యులను నామినీలుగా పేర్కొంటు ఆన్‌లైన్ నమోదు చేస్తారు. ఆతర్వాత చిరునామా, సెల్ నంబరును ఫీడ్ చేయగా సదరు లబ్ధిదారుడి నమోదు పూర్తి అయినట్టుగా వారి మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ వస్తోంది. అందులోని లింకును క్లిక్ పథకంలో ట్రాన్సాక్షన్ ఐడీ, డేట్, ఆప్లికేషన్ నంబరు దరఖాస్తుదారుడి పేరు పథకం, సెల్ నంబరు వివరాలు కన్పిస్తాయి. కాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో రేషన్‌కార్డులో ఒక్కరే సభ్యురాలు/సభ్యుడు ఉంటే నమోదు చేయడం లేదు. ఆన్‌లైన్‌లో రేషన్ కార్డును నమోదు చేయగానే దరఖాస్తుదారుడితో పాటు నామినిని ఎంచుకునేందుకు మరో సభ్యుడు కార్డులో లేక పోవడంతో ఈ అవకాశం లేకుండా పోయింది. పలువురి లబ్ధిదారుల కార్లులో ఉన్న పిల్లలు పెద్దవారై పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు కార్డులో తమ పేర్లను డిలీట్ చేయించి, కొత్తగా దంపతులైన వారి కుటుంబానికి మరో కొత్త రేషన్ కార్డును పొందారు. దీంతో చాలా కార్డుల్లో తల్లి లేదా తండ్రి ఉన్న కుటుంబంలో ఒక్కరే మిగిలిపోయారు. దీంతో అలాంటి వారు అవస్థలు పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
నిబంధనలు సరళతరం చేయాలి..
-దోని శ్రీశైలం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో నిబంధనలు సరళతరం చేయాలి. రేషన్‌కార్డులో ఉన్న ప్రతీ ఒక్కరికి వయసుతో సంబంధం లేకుండా బీమా కల్పించాలి. ఒక్కరికి మాత్రమే బీమా కల్పించడం సరికాదు. అలాగే రేషన్ కార్డులో ఒక్కరు ఉన్నా బీమా సౌకర్యం కల్పించాలి. ఈ పథకంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలి.