సెకండ్ హ్యాండ్ కారు.. 26 వేలకే!
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:26 AM
తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ కార్లను సొంతం చేసుకోవచ్చంటూ ప్రచారం చేసిన వ్యాపారి పథకం బెడిసికొట్టింది.
ముందు వచ్చిన 50 మందికి 50 కార్లు ఇస్తామంటూ రీల్స్
ఎగబడిన కొనుగోలుదారులు
10 కార్లే ఉన్నాయనడంతో ఆగ్రహానికి గురై కార్లపై రాళ్ల దాడి
నిర్వాహకుడిపై కేసు నమోదు
హైదరాబాద్ మల్లాపూర్‌లో ఘటన
తార్నాక, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ కార్లను సొంతం చేసుకోవచ్చంటూ ప్రచారం చేసిన వ్యాపారి పథకం బెడిసికొట్టింది. అంచనాకు మించి కొనుగోలుదారులు కార్లు విక్రయించే చోటుకు పోటెత్తడంతో చేతులెత్తేశారు. దీంతో ఆగ్రహానికి గురైన కొనుగోలుదారులు అక్కడున్న కార్లపై దాడి చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. హైదరాబాద్ మల్లాపూర్‌కు చెందిన రోషన్ అనే పాత కార్ల వ్యాపారి తన వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకునేందుకు కొద్దిరోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకర్షణీయమైన ప్రకటన ఇచ్చాడు. రిపబ్లిక్ డే (26న) సందర్భంగా రూ.26 వేలకే సెకండ్ హ్యాండ్ కారును సొంతం చేసుకోవచ్చని రీల్స్‌లో పేర్కొన్నాడు. కొనుగోలుదారులను ఆకట్టుకున్నారు. ఈ ఆఫర్‌లో భాగంగా ముందు వచ్చిన 50 మందికి 50 కార్లు అందజేస్తామని చెప్పడంతో 400 మంది వరకు తరలివచ్చారు. దీంతో సోమవారం తెల్లవారుజామునే హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి మల్లాపూర్‌లోని ట్రస్ట్ కార్స్ గ్యారేజీకి కొనుగోలుదారులు చేరుకున్నారు. గ్యారేజీ తెరవగానే కొనుగోలుదారులు కార్ల గురించి అడిగారు. నిర్వాహకులు 10 కార్లే ఉన్నాయని చెప్పడంతో ఆగ్రహానికి గురైన కొనుగోలుదారులు అక్కడే ఉన్న మిగతా కార్ల అద్దాలపై రాళ్లతో దాడి చేశారు. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కొనుగోలుదారులను పంపించివేశారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు ట్రస్ట్ కార్స్ యాజమాని రోషన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.