kumaram bheem asifabad- డీలిమిటేషన్‌తో ఆదివాసీలకు అన్యాయం
ABN , Publish Date - Nov 29 , 2026 | 10:17 PM
రాజ్యాంగాన్ని అనుసరించి రిజర్వేషన్లను అమలు చేయాలని, డీలిమిటేషన్‌తో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని ఆదివాసీ అధికార రాష్ట్రీయ యువమంచ్ జాతీయ వైస్‌చైర్మన్, మాజీ ఎంపీ బృందా కారత్ అన్నారు. పట్టణంలోని ప్రేమల గార్డెన్‌లో ఆదివారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాలుగో రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు
ఆసిఫాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగాన్ని అనుసరించి రిజర్వేషన్లను అమలు చేయాలని, డీలిమిటేషన్‌తో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని ఆదివాసీ అధికార రాష్ట్రీయ యువమంచ్ జాతీయ వైస్‌చైర్మన్, మాజీ ఎంపీ బృందా కారత్ అన్నారు. పట్టణంలోని ప్రేమల గార్డెన్‌లో ఆదివారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాలుగో రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అంతకు ముందు టీఏజీఎస్ జెండాను ఆవిష్కరించి ఆదివాసి అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆరు జిల్లాల ప్రతినిఽ దులు వారి జిల్లాల నివేదికలను సమర్పించారు. అనంతరం బృందా కారత్ మాట్లాడుతూ రాజ్యాధికారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పార్లమెంట్‌లో ఆదివాసీలకు కేవలం 47 సీట్లు మాత్రమే కేటాయించగా రాష్ట్రంలో అవి రెండుకు పరిమితమైందన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో కూడా కేవలం 12 సీట్లు మాత్రమే కేటాయించడం ఆదివాసీలను అధికారానికి దూరం చేయడమేనని చెప్పారు. 2011 జనగణన ప్రకారం బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. దీంతో ఆదివాసీలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. 2026 జనగణన ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని అప్పుడే ఆదివాసీల పెరిగిన జనాభకు అనుగుణంగా సీట్లు వస్తాయన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలుగా ఆదివాసీలు గెలిచినప్పుడే సమస్యల పరిష్కారానికి నోచుకుంటాయన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కరం కోసం రాష్ట్రీయ యువమంచ్ 15 రాష్ట్రాలలో తమ పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. టీఏజీఎస్ సభ్యత్వ నమోదును పెంచాలని పిలుపునిచ్చారు. టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ మీడియం బాబురావు మాట్లాడుతూ మహసభల స్ఫూర్తితో ఆదివాసీల హక్కుల రక్షణ కోసం పోరాటానికి సిద్ధం కావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ఆదివాసీల చట్టాలు అమలు చేసే విధంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్ మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ధి విద్యతోనే సాధ్యమవుతుందన్నారు. విద్యాభివృద్ది కోసం నాయకులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఏజీఎస్, సీపీఎం, సీపీఎం అనుబంధ సంఘాల నాయకులు అశోక్, రవికుమార్, మాలశ్రీ, భూపాల్, జయలక్ష్మి, రవిందర్, అశయ్య, శాంతికుమారి, దినకర్, రాజన్న, కార్తీక్, రాజేందర్, కృష్ణామాచారి, శ్రీనివాస్, అనంద్, టికానంద్ తదితరులు పాల్గొన్నారు.