ధరాభారం.. తగ్గేదెప్పుడు?
ABN , Publish Date - Jun 27 , 2026 | 06:36 AM
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, రూపాయి విలువ పతనంతో పెరిగిన ధరల భారం సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది.
పశ్చిమాసియా యుద్ధంతో ధరలకు రెక్కలు
పెట్రోల్, డీజిల్, గ్యాస్ నుంచి నిత్యావసరాల దాకా..
టిఫిన్ల నుంచి టీవీల దాకా అన్నీ పైపైకి..
అమాంతం పెరిగిన రేట్లతో విలవిల్లాడుతున్న జనం
యుద్ధం ఆగి, చమురు ధరలు పడినా తగ్గని ధరలు
పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు తగ్గితేనే ఏదైనా ప్రయోజనం
చమురు సంస్థలు పెట్రో ధరలు తగ్గించేది అనుమానమే!
ధరల భారంతో ఆందోళనలో పేద, మధ్యతరగతి జనం
ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి వెంకటేశ్వర్లు 8వ, 5వ తరగతులు చదువుతున్న తన పిల్లల కోసం పుస్తకాలు కొనడానికి ఒక బుక్‌స్టాల్‌కు వెళ్లారు. పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ కలిపి 8వ తరగతికి రూ.6,300, 5వ తరగతికి రూ.4,850 అవుతాయని.. ఇద్దరికి స్కూల్ బ్యాగులు, స్టేషనరీ కలిపి మరో రూ.3 వేలు అవుతాయని చెప్పడంతో కళ్లుతేలవేశారు. గతేడాదితో పోల్చితే రూ.2,000కుపైగా అదనంగా భారం పడిందని.. పుస్తకాలు, బ్యాగులు.. ఇలా అన్నింటి ధరలు బాగా పెరిగాయని ఆయన వాపోయారు.
కూకట్‌పల్లికి చెందిన నాగరాజు బిల్డర్. వివిధ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు నిర్మించి, ఫ్లాట్లు విక్రయిస్తుంటారు. గతేడాది ఆగస్టులో గాజులరామారంలో 24 ఫ్లాట్లుండే 8 అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టారు. చదరపు అడుగుకు రూ.2 వేల చొప్పున ధరతో కొనుగోలుదారులతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికల్లా ఫ్లాట్లు కట్టివ్వాల్సి ఉంది. కానీ పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో 8ఎంఎం ఉక్కు ధర కిలో రూ.58 నుంచి రూ.65కి.. సిమెంట్ బ్యాగ్ ధర రూ.300 నుంచి రూ.330కు పెరగడంతో ఆందోళనలో పడ్డారు. ధరల పెరుగుదలతో నిర్మాణ భారం పెరిగిందని, అగ్రిమెంట్ ప్రకారం పాతరేట్లతో ఫ్లాట్లను ఇస్తే నష్టపోక తప్పదంటున్నారు. నిర్మాణం సగానికిపైగా పూర్తయిందని, ఇప్పటికైనా ధరలు తగ్గితే కాస్త ఉపశమనం ఉంటుందని పేర్కొంటున్నారు.
హైదరాబాద్ సిటీ, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, రూపాయి విలువ పతనంతో పెరిగిన ధరల భారం సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఇన్నాళ్లూ వచ్చిన జీతాన్ని పొదుపు చేయలేకపోయునా ఇల్లు గడుస్తోందన్న భరోసాతో బతికినవారంతా..
ఇప్పుడు అప్పులు చేయకుండా బతుకీడ్వలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నిజానికి పశ్చిమాసియా యుద్ధంతో చమురు ధరలు పెరగడంతో.. దేశంలో పెట్రోల్, డీజిల్,వంటగ్యాస్ రేట్లు పెంచేశారు. దీనితో రవాణా వ్యయం పెరిగింది. చమురు నుంచి తీసే ప్లాస్టిక్ ఇతర ఉత్పన్నాలపై ఆధారపడిన ఎలకా్ట్రనిక్, ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయి. దిగుమతి కావాల్సిన పలు రకాల వస్తువుల కొరతతో వాటి రేట్లూ పైపైకి వెళ్లాయి. ఒక గొలుసుకట్టుగా మొత్తం ఆహారం, నిత్యావసరాలు, వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువులు.. ఇలా అన్నీ భారంగా మారాయి. ఇప్పుడు యుద్ధం ఆగిపోవడంతో.. చమురు ధరలు అంతకుముందు కంటే కూడా తగ్గిపోయాయి. ఎగుమతులు, దిగుమతులకు దారులు తెరుచుకున్నాయి. కానీ ఎక్కడా వేటి ధరలూ తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గితే.. రవాణా చార్జీలు తగ్గి, సరుకుల ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇప్పట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే ఉద్దేశం లేనట్టు పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. చమురు ధరలు పెరిగిన మొదట్లోనే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచకుండా నష్టాలు భరించామని.. అవన్నీ పూడ్చుకునేదాకా ధరలు తగ్గే అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు. దీనితో ధరల భారం నుంచి ఇప్పట్లో ఉపశమనం లభించేలా కనిపించడం లేదని సామాన్య, మధ్యతరగతి జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ధరలు ఇట్లా.. బతికేదెట్లా?
పెరిగిన ధరలతో ఇదీ అదీ అని లేకుండా దాదాపు అన్ని రంగాలపైనా ప్రభావం పడింది. ఉదాహరణకు బండ్లగూడజాగీర్ సన్‌సిటీకి చెందిన ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ మెహిదీపట్నంలో ఉన్న ప్రైవేట్ స్కూల్‌కు రోజూ 20 మంది పిల్లలను పికప్, డ్రాప్ చేస్తుంటారు. గతంలో ఒక్కో విద్యార్థికి నెలకు రూ.1,800 తీసుకున్న ఆయన.. ఇప్పుడు రూ.2,200 తీసుకుంటున్నారు. డీజిల్ ధరల భారంతో తానూ పెంచాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అదే ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఈసారి ఫీజులను 20శాతం దాకా పెంచింది. అదేమంటే అద్దెలు మొదలు అన్ని రకాల ఖర్చులూ పెరిగాయని, టీచర్లకు వేతనాలు కూడా పెంచాల్సి వచ్చిందని నిర్వాహకులు చెబుతున్నారు.
సోనామసూరి బియ్యం క్వింటాల్‌కు నాలుగు నెలల క్రితం రూ.5,200 ఉంటే... ఇప్పుడు రూ.5,600-5,800 వరకు చేరిందని.. వేరుశనగ కిలో రూ.120 నుంచి రూ.130కు పెరిగిందని చాదర్‌ఘాట్‌కు చెందిన హోల్‌సేల్ వ్యాపారి జగన్‌మోహన్ తెలిపారు. వేరుశనగ నూనెల ధరలు బ్రాండ్‌ను బట్టి రూ.165-168 నుంచి రూ.174-180 వరకు పెరిగాయని వెల్లడించారు.
ఇక ప్లాస్టిక్ వస్తువుల ధరలన్నీ పెరిగాయని ఒక చైనా బజార్ నిర్వాహకులు తెలిపారు. ఉదాహరణకు గతంలో పది లీటర్ల బకెట్ రూ.80 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.120కి చేరిందని వెల్లడించారు.
గతంలో 185 లీటర్ల రిఫ్రిజిరేటర్‌కు రూ.16వేల వరకు ఉంటే ఇప్పుడు రూ.17,500 దాటింది. 1.5 టన్ ఏసీలు రూ.45వేల నుంచి రూ.48వేలకు చేరాయి. ఇవేకాదు వాషింగ్ మెషీన్లు, ఫోన్లు సహా దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు 10-13 శాతం పెరిగాయని దుకాణాల నిర్వాహకులు చెప్పారు. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ధరలైతే 25శాతానికిపైగానే పెరిగాయని వెల్లడించారు.
గతంలో ప్లేట్ ఇడ్లీ రూ.35-40 మధ్య ఉంటే.. ఇప్పుడు రూ.50-60 వరకు తీసుకుంటున్నారు. పూరీ, దోశ, బజ్జీలు, మీల్స్, బిర్యానీ.. ఇలా అన్నిరకాల ఆహారం ధరలు 30శాతం వరకు పెరిగాయి. పెద్ద హోటళ్లలో ధరల గురించి చెప్పనవసరం లేదు.