Share News

సంతానలేమి చికిత్సకు ఇల్లుగుల్ల!

ABN , Publish Date - May 22 , 2026 | 04:41 AM

దేశంలో సంతానలేమి (ఇన్‌ఫెర్టిలిటి) సమస్య ఎదుర్కొంటున్న దంపతులకు వైద్య ఖర్చులు మోయలేని భారంగా మారుతున్నాయి.

సంతానలేమి చికిత్సకు ఇల్లుగుల్ల!

  • 59.4శాతం దంపతులపై మోయలేని ఆర్థిక భారం

  • ప్రభుత్వ ఆస్పత్రులకన్నా ప్రైవేటులో భారీ ఖర్చు

  • ఐసీఎంఆర్‌ తాజా అధ్యయనం వెల్లడి

హైదరాబాద్‌, మే 21 (ఆంధ్ర జ్యోతి): దేశంలో సంతానలేమి (ఇన్‌ఫెర్టిలిటి) సమస్య ఎదుర్కొంటున్న దంపతులకు వైద్య ఖర్చులు మోయలేని భారంగా మారుతున్నాయి. ఈ చికిత్స కోసం వారు వెచ్చిస్తున్న మొత్తం, వారిని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోంది. ఈ మేరకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పరిధిలోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ రిప్రొడక్టివ్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌’ (ఎన్‌ఐఆర్‌ఆర్‌సీహెచ్‌) అధ్యయనం వెల్లడించింది. దేశంలోని ఐదు ప్రధాన తృతీయ శ్రేణి (టెర్షియరీ) ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న దంపతులపై నిర్వహించిన ఈ పరిశోధనలో పలు విషయాలు బయటపడ్డాయి. కుటుంబ ఆహారేతర వార్షిక ఖర్చులలో 40 శాతం కన్నా ఎక్కువ కేవలం వైద్యానికే ఖర్చయితే, దాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిబంధనల ప్రకారం ‘కటస్ర్టోఫిక్‌ హెల్త్‌ ఎక్స్‌పెండిచర్‌’ (తీవ్ర ఆర్థిక నష్టం కలిగించే ఖర్చు)గా పరిగణిస్తారు. సంతానలేమి చికిత్స తీసుకుంటున్న వారిలో 59.4 శాతం దంపతులు ఇటువంటి తీవ్ర ఆర్థిక భారాన్ని మోస్తున్నారని ఎన్‌ఐఆర్‌ఆర్‌సీహెచ్‌ అధ్యయనం పేర్కొంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ సగటు ఖర్చు రూ.14,217గా ఉంటే, అదే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇది రూ.8,355గా నమోదైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చు తక్కువగా ఉన్నప్పటికీ, అక్కడ కొన్ని రకాల మందులు అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు వాటిని బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని నివేదిక పేర్కొంది. ఇక వివిధ రకాల శారీరక సమస్యల ఆధారంగా ఖర్చులు మారుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. వార్షిక సగటు ఎండోమెట్రియోసిస్‌ రూ.16,943 (అత్యధిక ఖర్చు), గర్భాశయ సమస్యలు రూ.14,605, పురుషుల్లో వంధ్యత్వ చికిత్సకు రూ.16,566, పీసీవోఎస్‌ రూ.13,020గా ఉంది. ఈ ఖర్చుల్లో ప్రధానంగా మందులు, డయాగ్నోస్టిక్స్‌ (అల్ర్టాసోనోగ్రఫీ, హెచ్‌ఎస్జీ, ల్యాప్రోస్కోపీ) వంటి వైద్య పరీక్షల ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంట్రా యుటెరైన్‌ ఇన్‌సెమినేషన్‌ (ఐయుఐ) ప్రక్రియ చేయించుకున్న వారిలో ఖర్చులు మరింత పెరుగుతున్నాయి. కాగా దేశంలో సంతానలేమి కేవలం శారీరక సమస్యే కాకుండా తీవ్రమైన సామాజిక, మానసిక ఒత్తిడికి కారణమవుతోంది. ఆయుష్మాన్‌ భారత్‌ వంటి ప్రభుత్వ బీమా పథకాల పరిధిలోకి ఓపీడీ ఆధారిత సంతానలేమి పరీక్షలను, మందులను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.


భద్రత లేని బీమా

దేశంలో సంతానలేమి సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో దాదాపు 17.5శాతం ఉన్నప్పటికీ, ఈ సమస్యను జాతీయ ఆరోగ్య మిషన్‌ లేదా ఆర్‌.ఎమ్‌.ఎన్‌.సి.హెచ్‌+ఏ వంటి ప్రధాన ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో చేర్చలేదు. అధ్యయనంలో పాల్గొన్న దంపతుల్లో ఒక్క శాతానికి మాత్రమే ఆరోగ్య బీమా రక్షణ ఉంది. ఇన్సూరెన్స్‌ లేకపోవడం వల్ల ఖర్చులు భరించలేక 44శాతం దంపతులు అప్పులు లేదా లోన్లు తెచ్చి చికిత్స చేయించుకుంటున్నట్లు వెల్లడైంది. వార్షిక ఆదాయం రూ.59,400 కంటే తక్కువ ఉండి, ఇతర ఆరోగ్య సమస్యలు (బీపీ, షుగర్‌, థైరాయిడ్‌) ఉన్న దంపతులు ఈ ఖర్చుల వల్ల మరింత కుంగిపోతున్నారు.

Updated Date - May 22 , 2026 | 04:41 AM