నెలలు తక్కువని వస్తే.. వికలాంగుడిగా మార్చారు!
ABN , Publish Date - May 31 , 2026 | 05:42 AM
నెలలు నిండని పిల్లాడా..!! రోజూ ఎన్నో కేసులు చూస్తాం.. వాటిల్లో ఇది కూడా ఒకటి అంతేగా...’’ అనుకుంటూ ఓ ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది విధి నిర్వహణలో చేసిన నిర్లక్ష్యం ఓ పసివాడి జీవితం పాలిట శాపమైంది.
ఏడు నెలల శిశువుకు రక్తం ఎక్కించే సమయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం
కాన్యులా అమర్చిన ప్రాంతంలో ఇన్‌ఫెక్షన్
చివరికి శిశువు చేయి పూర్తిగా తొలగింపు
ఖమ్మం కలెక్టరేట్, మే 30 (ఆంధ్రజ్యోతి): ‘‘ నెలలు నిండని పిల్లాడా..!! రోజూ ఎన్నో కేసులు చూస్తాం.. వాటిల్లో ఇది కూడా ఒకటి అంతేగా...’’ అనుకుంటూ ఓ ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది విధి నిర్వహణలో చేసిన నిర్లక్ష్యం ఓ పసివాడి జీవితం పాలిట శాపమైంది. నెలలు నిండక ముందే ఈ లోకంలోకి వచ్చిన ఓ పసికందు అంగవైకల్యానికి కారణమైంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ పసికందు చేతికి ఇన్‌ఫెక్షన్ జరిగి చివరికి ఆ చెయ్యిని పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. ఖమ్మం ప్రభుత్వ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన తలపాటి రేణుక, సత్యకాంత్ దంపతులు. ఏడు నెలల గర్భిణి అయిన రేణుక.. నెలలు నిండకమునుపే గత మార్చి 3న ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇద్దరు కవలలకు(అబ్బాయిలు)కు జన్మనిచ్చింది. ఇందులో ఓ పిల్లాడు 3 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉండగా, మరో బాబు కిలో 200 గ్రాముల బరువుతో పుట్టాడు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో... తక్కువ బరువుతో పుట్టిన శిశువు మార్చి 4న ఖమ్మం ప్రభుత్వ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో చేర్చారు. ఓ పిల్లాడితో రేణుక తాను ప్రసవించిన ప్రైవేటు ఆస్పత్రిలోనే ఉండిపోగా.. రేణుక బంధువు చిర్రా విజయకుమారి మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఉంచిన చిన్నారిని చూసుకున్నారు. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో పసికందును ఇంక్యుబేటర్‌లో ఉంచిన వైద్య సిబ్బంది చికిత్స అందించారు. ఈ క్రమంలో పలుమార్లు రక్తం ఎక్కించారు. అయితే, 18 రోజుల చికిత్స అనంతరం రక్తం ఎక్కించేందుకు పిల్లాడి ఎడమ చేతికి కాన్యులా పెట్టిన ప్రాంతంలో వాపు చేసింది. వాపును గమనించిన విజయకుమారి విషయాన్ని డ్యూటీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ‘‘దానికేం కాదులే’’ అని ఓ ఆయింట్‌మెంట్ రాసి సరిపెట్టారు.
మూడు రోజులు గడిచినా వాపు తగ్గకపోగా, చేయి నల్ల బడడం మొదలైంది. ఈ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా.. ‘ఏదో ఎల్బో వాపు.. ప్రైవేటులో స్కానింగ్ తీయించుకుని రండి.. ’అంటూ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అయితే, శిశువు చెయ్యిలో కదలిక లేదని, పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, కణజాల క్షీణత(గ్యాంగ్రిన్) బారిన పడి శిశువు చెయ్యి దెబ్బతిందని స్కానింగ్ రిపోర్టుల ద్వారా తేలింది. దీంతో మాతా శిశు సంరక్షణ కేంద్రం వైద్య సిబ్బంది... సాధారణ వాపేనని, శిశువు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలిస్తే అక్కడి వైద్యులు సమస్యను చిటికెలో నయం చేస్తారని నమ్మబలికి మార్చి 26వ తేదీ రాత్రి ఆ పసికందును అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు పంపించేశారు. శిశువును పరీక్షించిన నీలోఫర్ వైద్యులు.. ఇన్‌ఫెక్షన్ బాగా వ్యాపించిందని, చెయ్యిని పూర్తిగా తొలగించాలని చెప్పారు. దీంతో కుప్పకూలిపోయిన తల్లిదండ్రులు గత్యంతరం లేని పరిస్థితుల్లో శిశువు చేతిని తొలగించేందుకు అంగీకారం తెలిపారు. దీంతో నీలోఫర్ వైద్యులు శస్త్ర చికిత్స చేసి శిశువు ఎడమ చెయ్యిని భుజం వరకు తొలగించారు. కాగా, ఖమ్మం ఎంసీహెచ్ వైద్యులు కాన్యులాను చంకలో పెట్టడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని బాధిత తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. నీలోఫర్‌లో మే 12 వరకు వైద్యచికిత్సలు అందించి నయం చేశారని, శుక్రవారం తమను ఇంటికి పంపించారని తెలిపారు. తమ చిన్నారికి ప్రాణాపాయం తప్పినప్పటికీ.. ఖమ్మం ఎంసీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం తమ చిన్నారిని అంగవైకల్యానికి గురి చేసిందని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.