Share News

Dr. D. Nageshwar Reddy: వాయు కాలుష్యం, ధూమపానంతో ఊపిరితిత్తులకు సెగ

ABN , Publish Date - Jan 08 , 2026 | 03:32 AM

దేశంలోని నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం, ధూమపానంతో ఊపిరితిత్తులకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ డీ నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు.

Dr. D. Nageshwar Reddy: వాయు కాలుష్యం, ధూమపానంతో ఊపిరితిత్తులకు సెగ

  • రెండో అతిపెద్ద సమస్య లంగ్‌ క్యాన్సరే

  • ఎండలో ఉంచిన వాటర్‌ బాటిళ్లతో క్యాన్సర్‌ ముప్పు

  • ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి

  • ఐఐటీహెచ్‌లో జర్మనీ ఐఎల్‌హెచ్‌ భాగస్వామ్యంతో లంగ్స్‌ సమస్యలపై పరిశోధన కేంద్రం ప్రారంభం

కంది, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): దేశంలోని నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం, ధూమపానంతో ఊపిరితిత్తులకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ డీ నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు. దేశంలో ఊపిరితిత్తుల వ్యాధులే రెండో అతిపెద్ద అనారోగ్య సమస్యగా ఉందని చెప్పారు. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను విరివిగా వినియోగిస్తున్నారని, వాటిని ఎండలో ఉంచడం వల్ల మైక్రోప్లాస్టిక్‌ కణాలు పెరుగుతాయని, ఆ నీటిని తాగితే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఉందని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో జర్మనీకి చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లంగ్‌ హెల్త్‌ (ఐఎల్‌హెచ్‌) భాగస్వామ్యంతో ఊపిరితిత్తుల సమస్యలపై పరిశోధనకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాగేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వైద్యులు ఊపిరితిత్తుల మార్పిడి చేస్తున్నారని, ఐఎల్‌హెచ్‌-ఐఐటీహెచ్‌ బయో ఇంజనీరింగ్‌ విభాగాలు ప్రారంభించిన ఈ కేంద్రంలో ఇండో-జర్మన్‌ శాస్త్రవేత్తలు మూలకణాలతో కొత్త ఊపిరితిత్తులు సృష్టించేందుకు పరిశోధనలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కేంద్రంతో రానున్న ఐదేళ్లలో చాలావరకు ఊపిరితిత్తుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ మరణాల సంఖ్య గణనీయంగా ఉందని పేర్కొన్నారు. కరోనాతో వచ్చిన శ్వాస సమస్యలతో ఊపిరితిత్తుల ప్రాధాన్యత ప్రపంచానికి తెలిసిందన్నారు. వాయు కాలుష్యాన్ని నివారించాల్సి అవసరం ఉందని సూచించారు. నిత్యం యోగా, శ్వాస సంబంధిత వ్యాయామాలు,ఇంట్లో పొగరాని పొయ్యిలు వాడడం, అన్ని గదుల్లోకి వెలుతురు వచ్చేలా చూసుకోవడం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెప్పారు. ఊపిరితిత్తుల పునరుత్పత్తి, మార్పిడిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఐఎల్‌హెచ్‌ డైరెక్టర్‌ వెర్నర్‌ సీగర్‌ అన్నారు. ఈ కేంద్రం ఇంజనీరింగ్‌ ఆవిష్కరణలను క్లినికల్‌ సైన్స్‌తో అనుసంధానించడం ద్వారా ఊపిరితిత్తులు, హృదయ సంబంధ వ్యాధుల నిర్ధారణ, చికిత్సా మార్గాలను అభివృద్ధికి దోహదపడుతుందని ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి ఆకాంక్షించారు.

Updated Date - Jan 08 , 2026 | 03:32 AM