kumaram bheem asifabad- యథేచ్ఛగా ప్లాస్టిక్ వాడకం
ABN , Publish Date - Mar 25 , 2026 | 10:23 PM
ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగంతో ప్రాణాపాయం పొంచి ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు ప్లాస్టిక్ వస్తువుల వాడకంతో రోగాల బారిన పడుతున్నారు. ఇంటి బయట ఏది తిన్నా తెలియకుండానే ప్లాస్టిక్‌పె ౖఆధారపడాల్సి వస్తుండడంతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. మానవాళితో పాటు పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్(ఒక్కసారి వాడి పారేసే వివిధ రకాల వస్తువులను) బ్యాన్ చేయాలని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- జిల్లాలో నామమాత్రంగా అధికారుల తనిఖీలు
- నిబంధనలు పట్టించుకోని వ్యాపారులు
ఆసిఫాబాద్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగంతో ప్రాణాపాయం పొంచి ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు ప్లాస్టిక్ వస్తువుల వాడకంతో రోగాల బారిన పడుతున్నారు. ఇంటి బయట ఏది తిన్నా తెలియకుండానే ప్లాస్టిక్‌పె ౖఆధారపడాల్సి వస్తుండడంతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. మానవాళితో పాటు పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్(ఒక్కసారి వాడి పారేసే వివిధ రకాల వస్తువులను) బ్యాన్ చేయాలని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని వెంటనే నిషేధించాలని ఆదేశాలు జారీ చేసింది. గుడికి, బడికి వెళ్లినా, బజారుకు, కిరాణం షాపుకు, హోటల్స్‌కు పోయినా, మార్కెట్‌కు వెళ్లినా...ప్రతీ ఒక్కరు ప్లాస్టిక్ కవర్లతో దర్శనం ఇస్తున్నారు. అంతలా ప్రస్తుతం మానవ జీవితంలో ప్లాస్టిక్ ఒక భాగమైంది. మానవాళితో పాటు పర్యావరణానికి కీడు చేస్తున్న ప్లాస్టిక్(ఒక్కసారి వాడి పారేసే వివిధ రకాల వస్తువులను) బ్యాన్ చేయాలని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని వెంటనే నిషేధించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే 75మైక్రాన్ల లోపు మందం గల ప్లాస్టిక్‌ను వినియోగించకూడదనే నిబంధనలు ఉన్నా పాటించని వ్యాపారులు, ప్రజలు. ప్రస్తుతం 120మైక్రాన్ల మందం ఉన్న ప్లాస్టిక్‌ను వినియోగించకూడదని ప్రభుత్వం తీసుకొచ్చిచన నిబంధనలు పాటించడం లేదు.
- పెరిగిన వ్యాపారాలు..
జిల్లాలో వ్యాపారాలు పెరిగిపోయాయి. దీంతో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది. గ్రామాల్లో, పట్టణాల్లో నిషేదిత ప్లాస్టిక్‌ను కిరాణం, సూపర్ మార్కెట్లు, హోటళ్లు, పండ్ల దుకాణాలు, చిరువ్యాపారులు, చికెన్ సెంటర్లు, చేపలు విక్రయించేవారు, తదితర లావా దేవీల్లో ప్లాస్టిక్‌ను అడ్డు అదుపు లేకుండా వినియోగిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ మూలంగా పర్యావరణం దెబ్బతింటుంది. 75నుంచి 120 మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణం ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ వ్యాపారులు గ్రామాల్లో, పట్టణా ల్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ప్రజలు వాటిని వినియోగిస్తున్నారు. దీంతో నిషేధిత ప్లాస్టిక్ వాడకం పెరిగిపోయింది. దీనిని నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు .క్యారీ బ్యాగులు, బెలూన్స్, ఐస్‌క్రీం స్పూన్స్, ఇయర్ బడ్స్ స్టిక్స్, ప్లెక్సీలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్ కవర్లు, సిగరేట్ ప్యాకెట్స్, వాటర్ బాటిళ్లు, డిస్పో గ్లాసులు నిషేదించాల్సిన అవసరం ఉన్నప్పటికీ అవి కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తూ మానవాళికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయడం సాధ్యపడే అవకాశం కనిపించడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి.
- ప్రత్యామ్నాయ చర్యలేవి..
సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తే వాటి స్థానంలో జూట్ బ్యాగులను, క్లాత్ బ్యాగులను అందుబాటులో ఉంచాలి. కానీ అలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎవరూ చూపడం లేదు. సేంద్రియ పత్తి, వెదురు, చెక్కమట్టి పింగాణీ, ప్రకృతిలో త్వరగా కలిసిపోయే ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులను వాడాలి. మట్టి, పింగాణీ పాత్రలను ఆహారం నిల్వ చేయడానికి వినియోగించుకోవచ్చు. ప్రకృతిలో త్వరగా కలిసిపోయే కంపోస్టబుల్ కవర్లను చెత్తబుట్టలో వాడే కవర్లుగా, కాగితపు కప్పులకు వాడే పైపూతగా, పండ్లు, ఆహార పదార్థాలు, హోటళ్లలో పార్శిళ్లకు, పంట పొలాల్లో మట్టిని కప్పేందుకు తదితర వాటికి వీటిని వాడుకోవచ్చు. అయితే ప్రస్త్తుతం వీటి తయారీలు దేశంలో ఎక్కడా కనిపించడం లేదు. మొత్తం ప్లాస్టిక్ మయమైంది. ప్లాస్టిక్ మహామ్మారిని అరికట్టాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
- గ్రామాల్లో సైతం..
జిల్లా వ్యాప్తంగా ఉన్న పదిహేను మండలాల పరిధిలోని గ్రామాల్లో సైతం విచ్చల విడిగా దుకాణాల్లో ప్లాస్టిక్ బ్యాగులే దర్శనమిస్తున్నాయి. పైగా ప్రజలు కూడా బ్యాగులు తీసుకెళ్లడం మరిచిపోయారు. అయితే అధికారులు జిల్లాలో నామమాత్రంగానే తనిఖీలు చేపడుతు న్నారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగంపై ప్రజల్లో అవగాహన చర్యలు కల్పించని కారణంగా వినియోగం పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం 2022లో జూలై నుంచి పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ను నిషేదిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఎక్కడా కూడా అమలు కావడం లేదు. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ మహామ్మారిపై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోలేకపోవడంతో వాటి వినియోమగం విపరీతంగా పెరిగింది. కాగాచాలా అల్పాహారం కేంద్రాల్లో ఇడ్లీలను సైతం గుడ్డవేసే కాకుండా ప్లాస్టిక్ కవర్లపై ఉడికిస్తున్నారు. కొబ్బరి బొండాంలో ప్లాస్టిక్ స్ట్రా వేసుకొని తాగడం అనారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేడి తేనీరును కూడా ప్లాస్టిక్ సంచుల్లో పోయించుకొని, ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నారు. వివాహాలు, ఇతర శుభకార్యాల్లోనూ భోజనంతో పాటు తాగునీటి కోసం ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, స్ర్టాలను వాడుతున్నారు. ప్లాస్టిక్ కవర్లలోని రసాయనాలు ఆహారం, ఇతర పానియాల్లో కలిపి హార్మోనుల అసమతుల్యత, పునరుత్పత్తి సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి సమస్యలను కలిగిస్తాయి.