Share News

ఎడాపెడా కోతలు..

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:54 AM

అటు భానుడి భగభగలు.. ఇటు గంటల తరబడి కొనసాగుతున్న విద్యుత్‌ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో

 ఎడాపెడా కోతలు..

గణేశ్‌నగర్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): అటు భానుడి భగభగలు.. ఇటు గంటల తరబడి కొనసాగుతున్న విద్యుత్‌ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తరచూ కరెంట్‌ పోవడంతో ఫ్యాన్లు, కూలర్లు పనిచేయక ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత భరించలేక ప్రజలు చెట్ల నీడలు, బయట ప్రదేశాలవైపు పరుగులు తీస్తున్నారు. విద్యుత్‌ కోతల కారణంగా తాగునీటి సరఫరాపైనా ప్రభావం పడుతోంది. మోటార్లు పనిచేయక చాలాచోట్ల నీటి సమస్య తలెత్తుతోంది. వ్యాపారులు, చిన్నచిన్న దుకాణదారులు నష్టపోతున్నారు. విద్యుత్‌ అంతరాయాలతో ఫ్రిజ్‌లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలు పనిచేయక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. చిన్న గాలి వీచినా, వర్షం కురిసినా గంటల తరబడి కరెంట్‌ పోతుంది. దీంతో చీకట్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- పట్టించుకోని అధికారులు

ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నారు. కనీసం షెడ్యూల్‌ ప్రకారం విద్యుత్‌ సరఫరా చేయాలని, తరచూ జరిగే అంతరాయాలను నివారించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రతిరోజు రెండు నుంచి నాలుగు గంటలపాటు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. కారణాలు అడిగితే నిర్వహణ పనులు చేపడుతున్నామని, చెట్లకొమ్మలు కొట్టివేస్తున్నామని, అందుకే విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతోందని చెబుతున్నారు. సంవత్సరం మొత్తం నిర్వహణ పనులు ఉంటాయా అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. నిర్వహణ పనుల సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నా.. కోతలు యధావిధిగానే ఉంటున్నాయి. విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి కోతలు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jun 11 , 2026 | 12:54 AM