Share News

ఇందిరమ్మ కుట్టు మిషన్లకు దరఖాస్తుల జోరు

ABN , Publish Date - Sep 11 , 2026 | 06:32 AM

ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్‌ పథకం’కు క్షేత్రస్థాయిలో విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్రంలోని పేద, నిరుద్యోగ బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి వారిని ఆర్థికంగా నిలబెట్టే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టింది.

ఇందిరమ్మ కుట్టు మిషన్లకు దరఖాస్తుల జోరు
KUTTUMACHINE

  • ఇప్పటికే 2.90 లక్షలు దాటిన దరఖాస్తులు

  • ఈ నెల 15తో ముగియనున్న గడువు

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్‌ పథకం’కు క్షేత్రస్థాయిలో విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్రంలోని పేద, నిరుద్యోగ బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి వారిని ఆర్థికంగా నిలబెట్టే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మహిళలు పోటీపడుతున్నారు. ఈ నెల 15వ తేదీతో ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుండగా.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2.90లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన వెంటనే అర్హుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు యంత్రాంగం సమాయత్తమవుతోంది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలకుగాను ప్రతి నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1.19లక్షల మంది అర్హులైన బీసీ మహిళలకు మొదటి విడతలో ఆటోమేటిక్‌ కుట్టుమిషన్లు 100శాతం సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. ఒక్కో యూనిట్‌ విలువ రూ.12వేల వరకు ఉంటుంది. 18 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉండి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన మహిళలు ఈ పథకానికి అర్హులు.

దరఖాస్తుల పరిశీలన ఇలా..

దరఖాస్తుల గడువు పూర్తయిన వెంటనే మండల స్థాయిలో ఎంపీడీవోలు, మునిసిపాలిటీల్లో కమిషనర్ల ఆధ్వర్యంలోని కమిటీలు దరఖాస్తులను, ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తాయి. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యాక అర్హుల జాబితాను జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ తుది లబ్ధిదారుల జాబితాను ఖరారు చేస్తుంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అర్హులైన మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నారు.

Updated Date - Sep 11 , 2026 | 06:32 AM