20న ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్లకు శ్రీకారం
ABN , Publish Date - Jul 15 , 2026 | 06:21 AM
కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో నిర్మించతలపెట్టిన ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్లకు ఈ నెల 20న శ్రీకారం చుట్టనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
రెండు, మూడు రోజుల్లో డిజైన్ ఖరారు చేస్తాం
దశల వారీగా లక్ష ఇళ్ల నిర్మాణం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో నిర్మించతలపెట్టిన ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్లకు ఈ నెల 20న శ్రీకారం చుట్టనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణాలపై సచివాలయంలో మంగళవారం అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జ్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి అజారుద్దీన్‌తో కలిసి పథకానికి సంబంధించిన విదివిధానాలు, దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు, టెండర్ల ప్రక్రియ, అమలు విధానం తదితర మార్గదర్శకాలను ప్రకటిస్తామన్నారు. 2026-27లో క్యూర్ పరిధిలో లక్ష ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తొలిదశలో పైలట్ ప్రాజెక్టు కింద నియోజకవర్గానికి 500, అవసరమైన చోట 1000 వరకు నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్ కార్పొరేషన్ల పరిధిలోని నియోజకవర్గాల్లో స్థలాలను గుర్తించామని, బిల్డింగ్ డిజైన్లను రెండు, మూడు రోజుల్లో ఖరారు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ముందుచూపు లేకుండా హైదరాబాద్‌కు 30-40 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించిందని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతామనే ఆందోళనలో చాలామంది అక్కడ నివసించలేకపోతున్నారని తెలిపారు. పేదల జీవన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, వారు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లను నిర్మించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.