ఎల్‌ఐజీ ఇళ్ల దరఖాస్తు సమస్యల పరిష్కారం!
ABN , Publish Date - Jul 23 , 2026 | 06:44 AM
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ప్రారంభించిన ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల పథకం దరఖా స్తుల ప్రక్రియలో సమస్యలను హౌసింగ్ బోర్డు పరిష్కరించింది.
రెండో రోజు 1,565 దరఖాస్తులు.. పెరుగుతున్న అప్లికేషన్ల సంఖ్య
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ప్రారంభించిన ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల పథకం దరఖా స్తుల ప్రక్రియలో సమస్యలను హౌసింగ్ బోర్డు పరిష్కరించింది. మొదటి రోజైన మంగళవారం.. ‘మీ-సేవ’లో సాఫ్ట్‌వేర్ సమస్యలతో పాటు మీ-సేవ నిర్వహకుల అవగాహన లోపం కారణంగా అప్లికేషన్‌ల స్వీకరణ, ప్రాసెసింగ్‌లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో తొలిరోజు ఆశించినస్థాయులో దరఖాస్తులను స్వీకరించలేకపోయారు. దరఖాస్తు విధానంలో ఉన్న ఇతర మరికొన్ని అంశాలతోనూ దరఖాస్తుదారుల్లో గందరగోళం తలెత్తింది. దీనిపై.. ‘తొలిరోజు 115 దరఖాస్తులే’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం ప్రచురితమైన కథనంతో హౌసింగ్ బోర్డు సమస్యలను పరిష్కరించేందుకు రంగంలోకి దిగింది. సాఫ్ట్‌వేర్ సమస్యలను పరిష్కరించడంతోపాటు, పలు వెసులుబాట్లు కల్పించింది. ఫలితంగా దరఖాస్తుల స్వీకరణలో వేగం పెరిగిందని మీ-సేవ నిర్వహకులు చెప్పారు. బుఽధవారం 1,565 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. గురువారం నుంచి అప్లికేషన్స్ మరింత పెరుగుతాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి.