ఇళ్లు కేటాయించాకే నిర్మాణం
ABN , Publish Date - Jul 22 , 2026 | 06:07 AM
పట్టణ ప్రాంత గృహనిర్మాణ కార్యక్రమం కింద హైదరాబాద్‌లోని క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల పథకంలో ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది.
దరఖాస్తుల పరిశీలన పూర్తికాగానే కేటాయింపు.. ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్లకు సర్కారు కొత్త విధానం
లబ్ధిదారుగా ఎంపిక కాగానే రూ.లక్ష చెల్లించాలి
మిగిలిన రూ.5 లక్షలు వాయిదా పద్ధతిలో..
యూడీఎస్ కింద ఒక్కో లబ్ధిదారుకు
17 నుంచి 22 గజాల స్థలం ఉచితంగా రిజిస్ట్రేషన్
రూ.20-30 లక్షల విలువ చేసే స్థలం
10 అంతస్తులుగా టవర్లు.. ఒక్కో ఫ్లోర్‌లో 12 ఫ్లాట్లు
నాలుగు బ్లాక్‌లలో కలిపి 480 ఫ్లాట్ల నిర్మాణం
ప్రతి బ్లాక్‌లో 2 మెట్ల మార్గాలు.. 2 లిఫ్టుల ఏర్పాటు
ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యం
హైదరాబాద్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంత గృహనిర్మాణ కార్యక్రమం కింద హైదరాబాద్‌లోని క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల పథకంలో ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇళ్లు నిర్మించిన తరువాత లబ్ధిదారులను ఎంపిక చేయడం కాకుండా.. ముందుగానే లబ్ధిదారులను ఎంపిక చేసి.. వారికి ఇళ్లను కేటాయించిన తరువాతే నిర్మాణం చేపట్టనుంది. ఒకవేళ నిర్మించదలచిన ఇళ్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే.. అందరి సమక్షంలో లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. దీంతో నిర్మాణాలు పూర్తయ్యాక ఇబ్బంది రాకుండా ఉంటుందని, అంతేకాకుండా.. కేటాయింపులు పోగా ఇంకా ఎంతమందికి ఇళ్లు అవసరమనేది ముందుగానే తేలిపోతుందని, దాంతో తదుపరి నిర్మాణాలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక.. ఇందిరమ్మ ఇంటి కోసం ఎంపికైన లబ్ధిదారు తన వాటాకు సంబంధించిన రూ.6 లక్షల్లో ఇంటి కేటాయింపు జరగగానే రూ.1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.5 లక్షలను ఇంటి నిర్మాణం పూర్తయ్యేలోపు నాలుగు విడతల్లో చెల్లించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. కాగా, ఎల్‌ఐజీ కింద నిర్మించే టవర్లు ఎలా ఉంటాయి, ఫ్లాట్ లోపలి విస్తీర్ణాలు ఎలా ఉన్నాయి.. ఎన్ని బ్లాకుల్లో నిర్మించనున్నారనే వివరాలు ‘ఆంధ్రజ్యోతి’కి లభించాయి. దాని ప్రకారం..
4 బ్లాక్‌లు.. ఒక్కో బ్లాక్‌లో 120 ఫ్లాట్లు..
ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల పథకంలో భాగంగా క్యూర్ పరిధిలో గుర్తించిన 16 స్థలాల్లో తొలివిడతలో పైలట్ విధానంలో టవర్లను నిర్మించనున్నారు. ఒక్కో స్థలంలో 4 బ్లాక్‌ల చొప్పున వీటిని నిర్మిస్తారు. ఒక్కో బ్లాక్‌లో 120 ఫ్లాట్‌లు ఉండనుండగా, ఒక్కో అంతస్తులో 12 ఫ్లాట్‌లను నిర్మించేలా అపార్ట్‌మెంట్‌లను డిజైన్ చేశారు. మొత్తంగా 4 బ్లాకుల్లో కలిపి 480 ఇళ్లను నిర్మిస్తారు. మొత్తం 16 ప్రాంతాల్లో నాంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గాల పరిధిలోని రెడ్‌హిల్స్, హకీంపేట దర్గా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ సమీపంలో మాత్రం 360+120 చొప్పున రెండు విధానాల్లో నిర్మించనున్నారు. ఈ అపార్ట్‌మెంట్లలోని ఒక్కో బ్లాక్‌లో రెండు మెట్ల మార్గాలు, రెండు వైపులా లిఫ్టు సౌకర్యం కల్పించనున్నారు. టవర్లలో తూర్పు, పడమర వైపు ఉండేలా ఫ్లాట్‌లు ఉండనున్నాయి. ఒక్కో ఫ్లాట్‌లో హాలు (లివింగ్ రూమ్) విస్తీర్ణం 20 అడుగులు నిలువు, 9-4.5 వెడల్పుతో, కిచెన్ 5-6/6-0 విస్తీర్ణం, బెడ్‌రూమ్ 9-0/10 అడుగుల్లో, యుటిలిటీ ఏరియా 3-1.5/5, బాత్‌రూమ్ 5-7.5/4.3 అడుగుల విస్తీర్ణంలో కలిపి ఒక్కో ఫ్లాట్‌ను 528 చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు.
యూడీఎస్ కింద 22 గజాల స్థలం..
ఇందిరమ్మ ఎల్‌ఐజీ పథకం కింద నిర్మించే టవర్లలో ఇళ్లు పొందే లబ్ధిదారులకు ప్రభుత్వం స్థలాన్ని కూడా అందించనుంది. అయితే ఇల్లు విస్తీర్ణం 528 చదరపు అడుగులు కాగా, నిర్మించిన టవర్లు, అక్కడున్న స్థలాన్ని బట్టి ఒక్కో లబ్ధిదారుకు సుమారు 17 నుంచి 22 గజాల వరకు స్థలం దక్కనుంది. ఆ స్థలాన్ని లబ్ధిదారు పేరిట (మహిళ పేరు మీద) ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి, సేల్‌డీడ్‌ను వారికి ఇవ్వనుంది. దీని ప్రకారం ఒక్కో లబ్ధిదారుకు రూ.20-30 లక్షల విలువ చేసే ఆస్తి దక్కతుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఉదాహరణకు.. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, జూబ్లీహిల్స్, రాయదుర్గం లాంటి ప్రాంతాల్లో మార్కెట్ విలువ ప్రకారం ఒక్కో గజం రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలుకుతోందని, దీని ప్రకారం ఒక్కో లబ్ధిదారు పేరుమీదకు రూ.40 లక్షల వరకు ఆస్తి వస్తుందని గృహ నిర్మాణ శాఖ వర్గాలు అంటున్నాయి. కాగా, అల్పాదాయ వర్గాలు, ఏడాదికి రూ.6 లక్షల ఆదాయం ఉన్నవారికి ఇబ్బంది లేకుండా సేల్‌డీడ్‌ను బ్యాంకులో పెట్టుకుని రుణం పొందేలా ప్రభుత్వం సహకరిస్తుందని చెబుతున్నారు. తద్వారా ప్రస్తుతం నివసిస్తున్న ఇళ్లకు అద్దె రూపంలో చెల్లించే మొత్తాన్ని.. సొంత ఇంటి కోసం తీసుకున్న బ్యాంకు రుణానికి వాయిదా పద్ధతిలో చెల్లించుకోవచ్చని పేర్కొంటున్నారు.
ఇటుక లేకుండా ఇంటి నిర్మాణం..
ఇంటి నిర్మాణంలో ఇసుక, సిమెంటు, స్టీల్‌తోపాటు ఇటుక ముఖ్యం. అయితే ప్రభుత్వం నిర్మించే ఎల్‌ఐజీ అపార్ట్‌మెంట్‌లను మాత్రం ఇటుక లేకుండానే నిర్మించనున్నారు. ఇందుకోసం షీర్‌వాల్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఈ విధానంలో అపార్ట్‌మెంట్, ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం, డిజైన్ అన్నీ ముందుగానే ఖరారవుతున్నాయి. దీని ప్రకారం.. కింది నుంచి పై అంతస్తు వరకు అంతస్తుల వారీగా కాంక్రీట్‌తోనే గోడలను నిర్మిస్తారు. ఈ విధానంలో నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వడంతో పాటు ఏళ్ల తరబడి మన్నిక ఉంటుందని గృహ నిర్మాణ శాఖలోని ఇంజనీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో నిర్మిస్తున్న 30-40 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లను కూడా ఇదే విధానంలో నిర్మిస్తున్నారని చెబుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ లేకుండా, నూతన టెక్నాలజీతో, ఏళ్లపాటు మన్నికగా ఉండేలా ఎల్‌ఐజీ టవర్లను నిర్మిస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
12 నెలల్లో నిర్మాణం పూర్తిచేసేలా..
ప్రస్తుతం అపార్ట్‌మెంట్‌ల నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సంస్థను ఖరారు చేసేందుకు టెండర్ల ప్రక్రియ, నిబంధనలను అధికారులు ఖరారు చేస్తున్నారు. లబ్ధిదారులకు కేటాయింపులు పూర్తయ్యాకే టవర్లను నిర్మించనున్న నేపథ్యంలో 12 నెలల కాలంలోనే.. అంటే ఏడాదిలోనే నిర్మాణాలను పూర్తిచేయాలని టెండర్ నోట్‌లో పొందుపరచనున్నారు. తద్వారా నిర్మాణాలు శరవేగంగా పూర్తవుతాయని, లబ్ధిదారులకు సకాలంలో ఇళ్లను అందించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.