1న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన
ABN , Publish Date - May 29 , 2026 | 03:51 AM
ఇందిరమ్మ ఇల్లు పథకం రెండో విడత ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలం కొఠారి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండో విడత ఇళ్ల మంజూరును ప్రారంభించనున్నారు.
రెండో విడతలో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణం
నియోజకవర్గానికి 2,000 చొప్పున మంజూరు
మొదటి విడత మంజూరైనవి 4.50 లక్షలు
వాటిలో ఇప్పటికే లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి
లబ్ధిదారులకు చెల్లించింది రూ.6,500 కోట్లు
హైదరాబాద్ మే 28 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇల్లు పథకం రెండో విడత ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలం కొఠారి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండో విడత ఇళ్ల మంజూరును ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అదే కొఠారి గ్రామం పరిధిలో 28 మంది కొలాం ఆదివాసీలు ఇప్పటికే తొలివిడతలో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రివర్గ సభ్యులు కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. పేద కుటుంబాల్లో సొంత స్థలాలున్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం అందిస్తోంది. 400-600 చదరపు అడుగుల మధ్య లబ్దిదారులే ఇళ్లు నిర్మించుకోవాలి. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల కోసం ఇప్పటి వరకు రూ.6,500 కోట్లు లబ్దిదారుల ఖాతాలో జమ చేశారు. రెండో విడతలో నియోజక వర్గానికి 2 వేల ఇళ్ల చొప్పున 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేస్తారు. మొదటి విడతలో సుమారు లక్ష ఇళ్లు పూర్తయ్యాయి. జూన్ 1, 2 తేదీల్లో వాటి గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 2 లక్షల ఇళ్లు తుది దశకు చేరుకున్నాయి. 360 డిగ్రీల్లో అర్హులని తేలాకే లబ్ధిదారులుగా గుర్తిస్తున్నారు. జీపీఎస్, ఏఐ టెక్నాలజీలను వినియోగిస్తూ ఇళ్ల నిర్మాణాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పథకం విజయవంతం చేయడాన్ని సవాలుగా తీసుకున్నారు. ఇళ్ల మంజూరు నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు అవినీతికి తావులేకుండా ఉండేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చిన వెంటనే అధికారులపై చర్యలు తీసుకున్నారు. పారదర్శకత కోసం టోల్-ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఫిర్యాదులపై 24 గంటల్లోనే చర్యలు తీసుకునేలా కఠిన నిబంధనలు పెట్టారు. లబ్దిదారుల నుంచి లంచాలు అడిగిన వారిపై కఠినంగా వ్యవహరించారు. సుమారు 10 మంది అధికారులపై ఇప్పటికే శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.