Share News

క్యూర్‌లో ఇందిరమ్మ ఇళ్లు జనావాసాల మధ్యనే

ABN , Publish Date - Jul 25 , 2026 | 06:16 AM

కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు జనావాసాల మధ్యనే ఉండేలా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

క్యూర్‌లో ఇందిరమ్మ ఇళ్లు జనావాసాల మధ్యనే

  • వివిధ శాఖల పరిధిలోని నిరుపయోగ స్థలాలను గుర్తించండి: సీఎం రేవంత్‌

  • ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు జనావాసాల మధ్యనే ఉండేలా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్‌ రింగు రోడ్డు లోపల వివిధ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించారు. అయితే ఇప్పటికే గుర్తించిన స్థలాల వివరాలను అధికారులు సీఎంకు వివరించగా.. పోలీస్‌, రెవెన్యూ, రవాణా శాఖల పరిధిలోని నిరుపయోగ స్థలాలను తీసుకుని, ఆయా శాఖలకు వేరే చోట స్థలాన్ని కేటాయించాలని ఆయన ఆదేశించారు. క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, సంబంధిత అంశాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో పాటు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. జనావాసాలకు దూరంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు నిర్మించిన ఇళ్లు నిరుపయోగంగా మారే అవకాశముందన్నారు.


పని ప్రదేశాలకు దగ్గరగా, జనావాసాల పరిధిలోనే ఉండేలా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని.. దీనివల్ల నిరుపేదలు జీవనోపాధి కోల్పోబోరని చెప్పారు. క్యూర్‌ పరిధిలో 528 చదరపు అడుగులతో నిర్మించే ఒక్కో ఇంటికి రూ.11 లక్షలు ఖర్చవుతోందని, ఇందులో ప్రభుత్వమే రూ.5 లక్షలు సబ్సిడీ ఇస్తోందన్నారు. భూమిని పూర్తి ఉచితంగా లబ్ధిదారుకు ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తుందని పేర్కొన్నారు. తొలి దశలో పైలట్‌ ప్రాజెక్టు కింద 16 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢంలో వచ్చే ఏకాదశిని అందరూ ఏడాదిలో వచ్చే పండుగలకు ఇదే మొదటిదిగా జరుపుకొంటారన్నారు. తొలి ఏకాదశిని రైతుల పండుగగా అభివర్ణించిన సీఎం.. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసాతో రైతు కుటుంబాలన్నీ ఏకాదశి పండుగను ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.


హ్యాపీ బర్త్‌డే కేటీఆర్‌..

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ, రాష్ట్రాభివృద్ధికి పాటుపడడంలో ఆ భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం ఆకాంక్షించారు. ఈమేరకు ‘తెలంగాణ సీఎంవో’ ఎక్స్‌లో పేర్కొంది.

Updated Date - Jul 25 , 2026 | 06:17 AM