రెండోవిడత ఇందిరమ్మ ఇళ్లలో గుడిసెవాసులకే ప్రాధాన్యం
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:06 AM
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
రూఫ్ రీప్లే్‌సమెంట్ కింద రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 75 వేల మంది గుడిసెల్లో నివసిస్తున్నామని ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నారని, వాటన్నింటిని ప్రత్యక్షంగా పరిశీలించి అర్హులను గుర్తించాలని సూచించారు. గుడిసెల్లో నివసిస్తూ గతంలో ప్రజాపాలన లేదా ఇతర కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకోనివారు ఇప్పుడు మళ్లీ స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. రెండో విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఇళ్లకు ప్రభుత్వం రూఫ్ రీప్లే్‌సమెంట్ వెసులుబాటు కల్పించిందన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పైకప్పుల కింద నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను గుర్తించి వారికి ఆర్‌సీసీ స్లాబ్ నిర్మాణం కోసం రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. అలాగే గతంలో వివిధ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇళ్లను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించాలని ఆదేశించారు. గృహలక్ష్మి పథకం కింద నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన గృహాలను కూడా గుర్తించి రూఫ్ అప్‌గ్రేడేషన్ కార్యక్రమం ద్వారా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకొని చిన్న స్థలాలు కలిగిన లబ్ధిదారులకు అవసరాన్ని బట్టి గ్రౌండ్ ప్లస్ వన్ (జీ+1) నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వవచ్చని పేర్కొన్నారు.