కుటుంబ పెద్ద సంతకం కోసం మళ్లీ సర్వే
ABN , Publish Date - May 28 , 2026 | 03:44 AM
రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి భద్రత, ఒక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ పథకానికి శ్రీకారం చుట్టింది.
ఇందిరమ్మ కుటుంబ బీమా మార్గదర్శకాలపై కసరత్తు
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి భద్రత, ఒక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ పథకానికి శ్రీకారం చుట్టింది. దురదృష్టవశాత్తు ఇంటిపెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమాను అందించనున్నారు. వాస్తవానికి ఈ పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభించాలని నిర్ణయించగా, ఇంకా పూర్తిస్థాయిలో విధివిధానాలు, మార్గదర్శకాలు ఖరారు కాకపోవడంతో జూన్ చివర్లో అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే కుటుంబ బీమా పథకం అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయంచింది. ఇప్పటికే రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ సర్వే (కులగణన)ను చేట్టి.. ఇటీవలనే ఆ వివరాలను కూడా ప్రకటించారు. అయినప్పటికీ.. బీమా పథకం కోసం మరోసారి రాష్ట్రవ్యాప్త సర్వే చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో.. ఈ సర్వేను ఎలా చేస్తారు? ఏ శాఖ పరిధిలో నిర్వహిస్తారనే దానిపై ఆసక్తి ఉంది.
కుటుంబ పెద్ద.. ఆయనకు నామిని ఎవరు.!
రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు బీమా పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకోనున్నారని, ఇంటి పెద్దకే బీమాను వర్తింపచేసే అవకాశాలున్నట్టు అధికారికవర్గాల ద్వారా తెలిసింది. అలాగే రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డులు కలిగి ఉన్న కుటుంబాలనే అర్హులుగా గుర్తించనున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు చేపట్టబోయే సర్వేనే ఈ పథకంలో కీలకంగా మారనుంది. ఎందుకంటే.. ఈ సర్వే కులసర్వే మాదిరిగా కాకుండా గుర్తించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలతోనే ఉండనుంది. ఈ సర్వేలో కుటుంబలోని వ్యక్తులు సూచించేవారి పేరే ఇంటి పెద్దగా ఉంటుంది. అలాగే ఎవరినైతే బీమా పరిధిలోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు నిర్ణయిస్తారో.. ఆ వ్యక్తి సంతకంతో పాటు, ఆ వ్యక్తికి ఎవరిని నామిని ఉంచాలనేదానిపై సర్వేలో సేకరిస్తారు. ఆ సర్వేలో ఇచ్చే పేర్లు, సూచించే నామిని పేరే అంతిమ నిర్ణయంగా ఉంటుంది. ఈ సర్వేలో కుటుంబ పెద్ద లేదా బీమా పథకంలోకి వచ్చే వ్యక్తి సంత కం, నామిని సంతకాలు కీలకంగా ఉంటాయి.అలాగే బీమా పరిధిలోకి వచ్చే వ్యక్తి, నామినిగా ఉండే వారి ఆధార్ (ఈ-కేవైసీ) వివరాలను సేకరిస్తారు. దాని ప్రకారం ఆ ఇల్లు/వ్యక్తికి సంబంధించి సర్వే పూర్తయినట్టు ఒక స్టిక్కర్‌ను ఇంటికి అంటించనున్నారు. ఈ పథకం అమలు, విధివిధానాలు, మార్గదర్శకాల వ్యవహారాలను ప్రస్తుతం ప్రణాళిక శాఖ పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో పలు శాఖల వారీగా అమలవుతున్న ప్రమాద బీమాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎంత మందికి.. ఏ మేరకు ఎంత మేర ఆర్ధిక సాయం అందుతోంది? ఇప్పటికే అమలవుతున్న ప్రమాద బీమా పథకాల లబ్ధిదారులకు కూడా కుటుంబ బీమానే అందించాలా లేక, ఇప్పుడు అమలవుతున్న బీమానే కొనసాగించాలా? అనేదానిపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఈ అంశాలు తేలితే దాని ప్రకారం ఇందిరమ్మ కుటుంబ బీమా విదివిధానాలు, మార్గదర్శకాలు దాదాపు ఖరారైనట్టేనని అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. కాగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం కింద అవకాశం ఉండబోదని తెలుస్తోంది.