గాల్లో ఉండగా ఇంజన్‌లో సాంకేతిక లోపం
ABN , Publish Date - May 31 , 2026 | 05:11 AM
బెంగళూరు నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న ఇండిగో విమానం గాల్లో ఉండగా ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ అంతర్జాతీయ ....
శంషాబాద్‌లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
శంషాబాద్ రూరల్, మే 30 (ఆంధ్రజ్యోతి) : బెంగళూరు నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న ఇండిగో విమానం గాల్లో ఉండగా ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి శనివారం తెల్లవారుజామున 126 మంది ప్రయాణికులతో నాగపూర్ బయలుదేరిన 6ఈ 6003 ఇండిగో విమానం టేకాఫ్ తీసుకుని గాల్లోకి ఎగిరింది. కొద్దిసేపటికే దాని ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలెట్ దగ్గరలో ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) అధికారులతో ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఉందని అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరగా ఏటీసీ అధికారులు వెంటనే ఇతర విమాన సర్వీసుల రాకపోకలను నిలిపివేసి ఇండిగో విమానానికి అత్యవసర ల్యాడింగ్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో ఆ విమానం తెల్లవారుజామున 4 గంటలకు సురక్షితంగా ల్యాండైంది. అంతకుముందు విమానంలో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.