Share News

అమెరికా ట్రేడ్‌ డీల్‌తో మన రైతు కుదేలు

ABN , Publish Date - Feb 13 , 2026 | 04:46 AM

భారత్‌- అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మనదేశంలోని వ్యవసాయరంగంపై దీర్ఘకాలంలో దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు...

అమెరికా ట్రేడ్‌ డీల్‌తో మన రైతు కుదేలు

  • మొక్కజొన్న, సోయాపై ఇప్పటికే ప్రభావం

  • మనదేశంలో సాగుకు రక్షణాత్మక వ్యవస్థ అవసరం

  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): భారత్‌- అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మనదేశంలోని వ్యవసాయరంగంపై దీర్ఘకాలంలో దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. అమెరికాలో వ్యవసాయరంగానికి విస్తృత స్థాయిలో ప్రభుత్వ మద్దతు అందుతుందని, ఒక్కో రైతుకు ఏటా సగటున 70 వేల డాలర్ల మేర సబ్సిడీలు ఇచ్చి మార్కెట్‌ హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పిస్తున్నారని చెప్పారు. మనదేశంలో వడ్లు, కొన్ని పప్పుధాన్యాలు మినహా చాలా పంటలకు కనీస మద్దతు ధర, ఆదాయ భరోసా పూర్తిస్థాయిలో లభించడం లేదని తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యవసాయానికి సమగ్ర రక్షణ వ్యవస్థ అవసరం ఉందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మనదేశంలో చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉండగా, అమెరికాలో తక్కువ మంది రైతులు పెద్ద భూభాగాల్లో వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ మద్దతుతో తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేేస అమెరికా రైతులతో మన చిన్న రైతులు పోటీ పడటం అసాధ్యమని అన్నారు. వాణిజ్య ఒప్పందం తర్వాత అమెరికా నుంచి మొక్కజొన్న దిగుమతులు పెరిగి మెక్సికోలో లక్షల మంది రైతులు వ్యవసాయం వదిలివేయాల్సి వచ్చిన పరిస్థితి, హైతీలోనూ రైతులు తీవ్రంగా నష్టపోయారని తుమ్మల ఉదహరించారు. ఈ అనుభవాలు మన ముందే ఉన్నప్పటికీ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం కేంద్ర ప్రభుత్వం వెంపర్లాడటం ఆందోళనకరమని విమర్శించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల మనదేశంలో మొక్కజొన్న, సోయా పంటల ధరలు గణనీయంగా పడిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే ధరలు తగ్గటంతో పత్తి, సోయా, ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం నుంచిఆదాయ రక్షణ, పంటల బీమా, ఎగుమతి ప్రోత్సాహకాలు లేకుండా, ఇతర దేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలు రైతుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తాయని హెచ్చరించారు. అందుకే దేశంలో పండే ప్రధాన పంటలకు రక్షణాత్మక విధానం, దిగుమతుల ప్రభావం పడే పంటలకు ప్రత్యేక స్థిరీకరణ వ్యవస్థ అవసరమని సూచించారు. అమెరికాతో ఒప్పందం ఖరారు కాగానే సోయా చిక్కుడు ధరలు 10 శాతం, మొక్కజొన్న ధరలు 4 శాతం పడిపోయాయని తెలిపారు. వ్యవసాయ రంగం ఆర్థిక వ్యవస్థలో భాగం మాత్రమే కాదని.. గ్రామీణ జీవన విధానానికి, ఆహార భద్రతకు మూలస్తంభమని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 04:46 AM