ఆమెకు 26.. అతడికి 28
ABN , Publish Date - Jul 06 , 2026 | 03:39 AM
ఏ ఈడులో జరగాల్సిన ముచ్చట ఆ ఈడులో జరగాల్సిందే’ ..అంటూ ఒకప్పుడు ఆడైనా, మగైనా యుక్తవయసు రాగానే పెళ్లి చేసేవారు.
భారత్‌లోయువతీయువకుల సగటు వివాహ వయసు ఇదే
కెరీర్‌లో స్థిరపడి ఆర్థికంగా బలపడ్డాకే పెళ్లి మాట
ఇప్పటికీ మెజారిటీ పెళ్లిళ్లు పెద్దలు కుదురుస్తున్నవే
65శాతం కుటుంబాలకు జాతకచక్రాలపై నమ్మకం
మారిన భారతీయ వివాహ ‘బయోడేటా’ ట్రెండ్స్
ఆస్ట్రేలియా పురుషుల సగటు పెళ్లి వయసు 39.3
హైదరాబాద్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ‘ఏ ఈడులో జరగాల్సిన ముచ్చట ఆ ఈడులో జరగాల్సిందే’ ..అంటూ ఒకప్పుడు ఆడైనా, మగైనా యుక్తవయసు రాగానే పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. నేటి ఆధునిక ప్రపంచంలో.. జీవితంలో అన్ని విధాలా స్థిరపడ్డాకే పెళ్లి అనే భావన బాగా పెరిగింది. బాగా చదివి.. ఉద్యోగమో, వ్యాపారమో చేసి ఆర్థిక స్థిరత్వం సాధించాకే పెళ్లిపీటలు ఎక్కాలని నేటి యువత భావిస్తోంది. పెళ్లి సంబంధాలు చూసే విధానంలో కూడా పెనుమార్పులు వచ్చాయి. ఒకప్పుడు తెలిసిన సంబంధాలు చూసేవారు.. ఇప్పుడు డిజిటల్ బాట పడుతున్నారు. మార్గమేదైనా ఇప్పటికీ మనదేశంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రముఖ వెడ్డింగ్ ప్రొఫైల్ మేకర్ సంస్థ ‘బయోడేటా బిల్డర్’ భారతదేశంలో పెళ్లిళ్ల ట్రెండ్స్‌పై విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడైన వివరాలివి. పాశ్చాత్య సంస్కృతి, డేటింగ్ యాప్‌ల హడావుడి నగరాల్లో ఎంత కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయని.. దేశంలో జరుగుతున్న మొత్తం వివాహాల్లో దాదాపు 85 శాతం పెళ్లిళ్లు ఇప్పటికీ పెద్దలు కుదిర్చినవి లేదా యువతీ యువకులు ఇష్టపడితే పెద్దల సమక్షంలో జరుగుతున్నవేనని నివేదిక పేర్కొంది. దాని ప్రకారం..
దశాబ్దన్నర క్రితంతో పోలిస్తే భారతీయుల సగటు వివాహ వయసు దాదాపు రెండేళ్లు పెరిగినట్లు ఈ సర్వే నివేదిక వెల్లడించింది. 2010 నాటికి అమ్మాయిల సగటు వివాహవయసు 24గా ఉండగా.. ఇప్పుడది 26 ఏళ్లకు చేరింది. అబ్బాయిల సగటు వివాహవయసు కూడా 26 నుంచి 28కి పెరిగింది.
మెజారిటీ సందర్భాల్లో పెళ్లి సంబంధం కుదరాలంటే జాతక పొంతన తప్పనిసరిగా మారింది. సర్వే ప్రకారం 65 శాతానికి పైగా కుటుంబాలు.. అబ్బాయి/అమ్మాయి బయోడేటాతో పాటే వారు పుట్టిన సమయం, పుట్టిన ప్రాంతం, గోత్రం, రాశి, నక్షత్రం వివరాలను కోరుతున్నాయి. జాతకాలు కుదిరితేనే తదుపరి పెళ్లి చూపుల ముచ్చట మొదలవుతోంది.
దాదాపు 90 శాతానికి పైగా సందర్భాల్లో అమ్మాయి, అబ్బాయి బయోడేటాలు వాట్సాప్ ద్వారానే షేర్ అవుతున్నాయి.
అయినా.. మనోళ్లే టాప్
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మగవారు సగటున ఏ వయసు పెళ్లి చేసుకుంటున్నారన్న అంశంపై ప్రముఖ అంతర్జాతీయ పురుషుల ఆరోగ్య సంరక్షణ సంస్థ మాన్యువల్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ‘మేల్ మైల్‌స్టోన్స్- మెన్ ఇన్ నంబర్స్’ సర్వేలో పురుషుల వివాహ వయసుకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన అంశా లు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే ప్రకారం ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతీయ పురుషులు అత్యంత తక్కువ వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతుండగా, పాశ్చాత్య దేశాల్లో మాత్రం 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో పెళ్లి చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. మాన్యువల్ సర్వే చేసిన 35 దేశాల జాబితాలో.. అత్యంత పిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటున్న పురుషు లు ఉన్న దేశంగా భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. భారత్‌లో పురుషుల సగటు వివాహ వయసు 26 ఏళ్లుగా నమోదైంది. భారత్ తర్వాత చైనా 27.1 ఏళ్లు, రష్యా 27.4 ఏళ్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక.. బాగా వయసు మీరాక పెళ్లి చేసుకుంటున్న పురుషులు ఎక్కువగా ఉన్న దేశం ఆస్ట్రేలియా. ఆ దేశ పురుషులు సగటున 39.3 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంటున్నారు. ఆస్ట్రియా (37.4 ఏళ్లు), స్వీడన్ (36.7 ఏళ్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బ్రిటన్‌లో పురుషుల సగటు వివాహ వయసు 33.4 ఏళ్లు కాగా.. అమెరికాలో 29.8 ఏళ్లుగా నమోదైంది.