హైదరాబాద్‌లో భారీ గ్యాస్ ఆటమైజర్ !
ABN , Publish Date - May 16 , 2026 | 04:37 AM
అధునాతన మెటీరియల్స్ తయారీలో విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశంలోనే మొట్టమొదటి భారీ స్థాయి..
దేశంలోనే ఇది మొదటి భారీ స్థాయి కేంద్రం
ఐఐటీహెచ్, డీఎంఆర్‌ఎల్, ఇన్నోమెట్ మధ్య ఒప్పందం
కంది, మే 15 (ఆంధ్రజ్యోతి): అధునాతన మెటీరియల్స్ తయారీలో విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశంలోనే మొట్టమొదటి భారీ స్థాయి (100 కిలోల) ‘ఇనర్ట్ గ్యాస్ ఆటమైజర్’’ ప్లాంట్ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. దేశ రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకనున్న ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌లోని ఇన్నోమెట్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ లిమిటెడ్ సంస్థ ప్రాంగణంలో త్వరలో అందుబాటులోకి రానుంది. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- హైదరాబాద్ (ఐఐటీహెచ్), డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చి లాబొరేటరీ (డీఎంఆర్‌ఎల్), హైదరాబాద్‌కు చెందిన ఇన్నోమెట్ సంస్థలు ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఈ మేరకు శుక్రవారం మూడు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. భారత్‌లో అధునాతన లోహ సాంకేతికత, రక్షణ, అంతరిక్ష తయారీ రంగాలకు కొత్త దిశను చూపే ఈ ప్రాజెక్టును ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని వారణాసి ఐఐటీ-బీహెచ్‌యూలో ఉన్న డీఐఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. అధునాతన మెటీరియల్స్ పరిశోధనలో ఐఐటీ హైదరాబాద్ మరో మైలురాయిని అధిగమించిందన్నారు. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు.