రోజుకు 1.71 లక్షల టన్నుల చెత్త ఉత్పత్తి
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:36 AM
దేశంలో చెత్త సమస్య రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుతోంది. దేశవ్యాప్తంగా చెత్త వల్ల కాలుష్యం వేగంగా పెరుగుతుండగా, మరోవైపు హైదరాబాద్ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోందని తాజా నివేదికలు చెబుతున్నాయి.
అందులో 61 శాతమే శుద్ధి.. ఇదీ పట్టణాల్లో పరిస్థితి
1994నుంచి 2020 నాటికి 226శాతం పెరిగిన చెత్త
హైదరాబాద్ పరిస్థితి మరింత ఆందోళనకరం..
ప్రపంచంలోనే నాలుగో అత్యధిక మీథేన్ ఉద్గార కేంద్రంగా జవహర్‌నగర్ ల్యాండ్‌ఫిల్
వ్యర్థాలన్నింటినీ శుద్ధిచేస్తే రూ.5.89 లక్షల కోట్ల రాబడి!
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): దేశంలో చెత్త సమస్య రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుతోంది. దేశవ్యాప్తంగా చెత్త వల్ల కాలుష్యం వేగంగా పెరుగుతుండగా, మరోవైపు హైదరాబాద్ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోందని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఈ వ్యర్థాలను సేకరించి శుద్ధి చేస్తే 2047 నాటికి రూ.5.89 లక్షల కోట్ల సంపదను సృష్టించవచ్చని సూచిస్తున్నాయి. దేశంలో వ్యర్థాల వల్ల వచ్చే గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు 2047 నాటికి 11.95 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ స్థాయికి పెరిగే ప్రమాదం ఉందని ‘కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్, వాటర్ (సీఈఈడబ్ల్యూ)’ విడుదల చేసిన ‘వికసిత్ భారత్ కోసం సేంద్రియ వ్యర్థాల సర్క్యులర్ ఎకానమీ నివేదిక’ హెచ్చరించింది. దీనికి కారణం దేశంలో ఉత్పత్తి అయ్యే చెత్తలో దాదాపు సగం సరైన విధంగా శుద్ధి చేయకుండా డంప్ యార్డులకు తరలించడమేనని తెలిపింది. 1994 నుంచి 2020 నాటికి చెత్త వల్ల కాలుష్యం 226శాతం పెరిగిందని పేర్కొంది. దేశవ్యాప్తంగా పట్టణాల్లో రోజుకు సుమారు 1.71 లక్షల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇందులో దాదాపు సగం సేంద్రియ చెత్త (ఆహార అవశేషాలు). కానీ కేవలం 61 శాతం మాత్రమే శుద్ధి అవుతోంది. పూర్తిస్థాయిలో శుద్ధి చేస్తే కంపోస్ట్ ఎరువు, బయోగ్యాస్, బయోమీథేన్ తయారుచేయవచ్చని, 2047 నాటికి 101 మెట్రిక్ టన్నుల కార్బన్‌డయాక్సైడ్ కాలుష్యం తగ్గించవచ్చని నివేదిక తెలిపింది.
ఆ ల్యాండ్‌ఫిల్‌లో రోజుకు 9,600 మెట్రిక్ టన్నుల చెత్త
హైదరాబాద్ విషయానికొస్తే శివారులోని జవహర్‌నగర్ ల్యాండ్‌ఫిల్ ప్రపంచవ్యాప్తంగా మీథేన్ వాయు ఉద్గార ప్రదేశాల్లో 4వ స్థానంలో నిలిచింది. రోజుకు సుమారు 9,600 మెట్రిక్ టన్నుల చెత్తను ఇక్కడకు తరలిస్తున్నారు. ఇక్కడ గంటకు సుమారు 5.9 టన్నుల మీథేన్ వాయువు విడుదలవుతోందని అమెరికా యూనివర్సిటీకి చెందిన ‘స్టాప్ మీథేన్ ప్రాజెక్ట్’ నివేదిక తెలిపింది. ఈ డేటాను కార్బన్ మ్యాపర్ ఉపగ్రహాల ద్వారా సేకరించారు. ఒక ల్యాండ్‌ఫిల్ గంటకు 5 టన్నుల మీథేన్ విడుదల చేస్తే, అది ఏడాదికి సుమారు 10 లక్షల ఎస్‌యూవీలు లేదా 500 మెగావాట్ల బొగ్గు విద్యుత్ కేంద్రం కలిగించే భూతాపం (గ్లోబల్ వార్మింగ్) ప్రభావంతో సమానమని నివేదిక చెబుతోంది. జవహర్‌నగర్ డంప్ యార్డ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే, ఇతర నేతలు కలిసి వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని తరలింపుపై నిపుణులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ జాబితాలో ముంబైలోని ఒక ల్యాండ్‌ఫిల్ 12వ స్థానంలో ఉంది. అది గంటకు 4.9 టన్నుల మీథేన్‌ను విడుదల చేస్తోంది.